Virat Kohli Speech: చివరి బంతికి గెలిచిన ఆర్సీబీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఫైర్ స్పీచ్!

Virat Kohli emotional dressing room speech. ఎంఐతో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Rishvik
Published on: 11 May 2026 7:13 PM IST
Virat Kohli Speech
X

Virat Kohli Speech: చివరి బంతికి గెలిచిన ఆర్సీబీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ ఫైర్ స్పీచ్!

Virat Kohli Speech: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)పై చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాయ్‌పూర్‌లో జరిగిన ఈ థ్రిల్లర్ మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ చివరి బంతికి ఛేదించింది. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. మ్యాచ్ అనంతరం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్‌లో చేసిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. విరాట్ కోహ్లీ డకౌట్ కాగా.. దేవదత్ పడిక్కల్ (12), కెప్టెన్ రజత్ పటీదార్ (8) కూడా నిరాశపరిచారు. దీంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. అయితే ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య ఒత్తిడిలో అద్భుతంగా ఆడి 46 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేశాడు. చివరి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ కీలక పరుగులు చేయడంతో.. బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ‘నేను ఎక్కువగా మాట్లాడను. ఈరోజు గేమ్‌లో ఏదైనా చేయడానికి అవకాశం ఇచ్చిన ఆండీ ఫ్లవర్‌కు థ్యాంక్స్. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇలాంటి మంచి టీమ్ టోర్నమెంట్స్ గెలవాలంటే ఇలాంటి మ్యాచ్‌లు అవసరం. పోరాడాలి.. గెలుపు కోసం చివరి వరకు ఫైట్ చేయాలి. ఈ మ్యాచ్ మనకు అదే నేర్పించింది’ అని అన్నాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ‘పవర్‌ప్లేలో భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నీ ఎగ్జిక్యూషన్, నీ స్కిల్స్ వరల్డ్ క్లాస్. 11 మ్యాచ్‌ల్లో ఆరు సార్లు మూడు వికెట్ల ప్రదర్శన అంటే నిజంగా క్రేజీ’ అని కొనియాడాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2026లో 21 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కొనసాగుతున్నాడు.

భువనేశ్వర్ కుమార్ కూడా తన ఫామ్‌పై స్పందించాడు. ‘నేను ఏం చేయాలని అనుకుంటున్నానో అదే జరుగుతోంది. ఇది మొత్తం కాన్ఫిడెన్స్ వల్లే. టోర్నీ ఆరంభంలో కొన్ని మంచి మ్యాచ్‌లు ఆడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇప్పుడు నా ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్‌గా ఉంది. వికెట్లు వస్తున్నాయి. ఫీల్డర్లు కూడా కీలక క్యాచ్‌లు అందుకుంటున్నారు’ అని తెలిపాడు. విరాట్ కోహ్లీ ఇతర బౌలర్లను కూడా ప్రత్యేకంగా ప్రశంసించాడు. ‘రొమారియో షెఫర్డ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నువ్వు నీ ఏరియాస్లో హిట్ చేస్తే ఎంత ప్రమాదకరమో చూపించావు. నీ స్కిల్స్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. కృనాల్ పాండ్య ఒత్తిడిలో ఎప్పుడూ జట్టుకు అండగా ఉంటాడు. సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని పేర్కొన్నాడు.

బ్యాటింగ్ వైఫల్యంపై కూడా కింగ్ కోహ్లీ నిజాయితీగా స్పందించాడు. ‘మనకు మంచి ఆరంభం దక్కలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో కూడా ఆరంభాలు లేవు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో జట్టుగా కలిసి పోరాడటం చాలా ముఖ్యం. గత మ్యాచ్‌లో రజత్, కృనాల్ బాధ్యత తీసుకున్నారు. టిమ్ డేవిడ్ కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఇవే జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లు’ అని డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ విజయంతో ఆర్సీబీ 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధించినా ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం కానుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story