IPL 2026 Final: 'కింగ్' కోహ్లీకి ఫైనల్ భయం.. కళ్ల ముందు రూ.20 కోట్లు, ఆర్సీబీ కప్పు గెలిచేనా?

Virat Kohli Bad Record in IPL Finals. ఐపీఎల్ ఫైనల్స్‌లో విరాట్ కోహ్లీ గణాంకాలు ఆందోళనకరంగా ఉండడం అభిమానుల్లో భయం నెలకొంది.

Rishvik
Updated on: 31 May 2026 6:40 PM IST
IPL 2026 Final
X

IPL 2026 Final: 'కింగ్' కోహ్లీకి ఫైనల్ భయం.. కళ్ల ముందు రూ.20 కోట్లు, ఆర్సీబీ కప్పు గెలిచేనా?

IPL 2026 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఫైనల్‌ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ఆరంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ (జీటీ) మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని ఐకానిక్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మహా సమరంలో అందరి దృష్టి మరోసారి కింగ్ విరాట్ కోహ్లీపైనే నిలిచింది. అయితే ఈసారి రికార్డుల రారాజు కోహ్లీ ముందున్న అతిపెద్ద సవాల్ ప్రత్యర్థి బౌలర్లు కాదు.. ఫైనల్స్‌లో అతని పేలవమైన రికార్డే. ఫైనల్స్‌లో కోహ్లీ గణాంకాలు ఆందోళనకరంగా ఉండడం అభిమానుల్లో భయం నెలకొంది.

ఫైనల్స్‌లో పేలవ గణాంకాలు:

అంతర్జాతీయ క్రికెట్‌లోనూ, ఐపీఎల్‌లోనూ విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ ఫైనల్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో కింగ్ రాణించలేకపోయాడు. ఇప్పటివరకు నాలుగు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన కోహ్లీ.. మొత్తం 139 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు 34.75 కాగా.. స్ట్రైక్‌రేట్ 126.36గా ఉంది. బిగ్ మ్యాచ్‌ల్లో తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోవడం ఆర్సీబీ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

అద్భుత ఫామ్‌లో కింగ్ కోహ్లీ:

ఈ సీజన్‌లో బ్యాటర్ల పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. యువ బ్యాటర్ల హవా కొనసాగుతున్న ఐపీఎల్ 2026లో విరాట్ కోహ్లీ తన అనుభవం, క్లాస్‌తో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 600కు పైగా పరుగులు సాధించి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా తన స్ట్రైక్‌రేట్‌పై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇస్తూ.. ఏకంగా 164.38 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ప్రతి మ్యాచులో యాంకర్ పాత్ర పోషిస్తూ.. అవసరమైనప్పుడు వేగంగా పరుగులు రాబడుతూ తన ఆటలో కొత్త కోణాన్ని చూపించాడు.

ఆర్సీబీ ఆశలన్నీ కోహ్లీపైనే:

ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీ విజయావకాశాలు చాలా వరకు విరాట్ కోహ్లీ ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ అతను మంచి ఆరంభాన్ని భారీ ఇన్నింగ్స్‌గా మలచగలిగితే.. బెంగళూరు వరుసగా రెండోసారి టైటిల్ గెలిచే అవకాశాలు మరింత పెరుగుతాయి. ఇప్పటివరకు ఐపీఎల్ ఫైనల్స్‌లో తన ముద్ర వేయలేకపోయిన కోహ్లీ.. ఈసారి మాత్రం అద్భుత ఫామ్‌తో ఫైనల్ బరిలోకి దిగుతున్నాడు. ఫైనల్స్‌లో ఉన్న చెత్త రికార్డును చెరిపేసి.. జట్టుకు మరో టైటిల్ అందించే ఇన్నింగ్స్ ఆడతాడా? లేక మరోసారి నిరాశపరుస్తాడా? అన్నది ఈ రాత్రి తేలనుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story