VVS Laxman Medal: కొత్త అవార్డును ఇంట్రడ్యూస్ చేసిన కొత్త కోచ్.. తొలి విజేత తిలక్ వర్మ!

VVS Laxman Introduces Best Attitude Award. భారత జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు.

Rishvik
Published on: 25 July 2026 5:52 PM IST
VVS Laxman Medal
X

VVS Laxman Medal: కొత్త అవార్డును ఇంట్రడ్యూస్ చేసిన కొత్త కోచ్.. తొలి విజేత తిలక్ వర్మ!

VVS Laxman Medal: భారత జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో తాత్కాలిక హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు వారి అంకితభావం, జట్టు కోసం చూపించే వైఖరిని ప్రోత్సహించేందుకు 'బెస్ట్ ఆటిట్యూడ్ అవార్డు'ను ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ అవార్డును తొలి టీ20 మ్యాచ్ అనంతరం యువ బ్యాటర్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ అందుకున్నాడు. జింబాబ్వేతో తొలి టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

జింబాబ్వే సిరీస్‌కు రెగ్యులర్ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతిని తీసుకున్నాడు. దాంతో హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మూడు మ్యాచ్‌లే కాబట్టి జట్టుతో తక్కువ సమయం గడిపే అవకాశం వచ్చినప్పటికీ.. ఆటగాళ్లలో సానుకూల వాతావరణం నెలకొల్పే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రత్యేక అవార్డును లక్ష్మణ్ తీసుకొచ్చాడు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'కేవలం బ్యాటింగ్, బౌలింగ్ లేదా ఫీల్డింగ్‌లో రాణించిన ఆటగాళ్లనే కాదు.. జట్టు కోసం చూపించే ఆటిట్యూడ్, కట్టుబాటు, అంకితభావాన్ని కూడా గుర్తించి ప్రోత్సహించాలనుకుంటున్నాం. అందుకే ఈ సిరీస్‌లో బెస్ట్ ఆటిట్యూడ్ అవార్డు అందజేస్తాం' అని తెలిపాడు.

బెస్ట్ ఆటిట్యూడ్ అవార్డు విజేతను ఎంపిక చేసే బాధ్యతను టీమిండియా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ హర్ష, పర్ఫార్మెన్స్ కోచ్ జాయ్‌కు అప్పగించారు. వీరిద్దరూ తిలక్ వర్మను తొలి విజేతగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హర్ష మాట్లాడుతూ.. 'తిలక్ వర్మ మైదానం బయట ఎంత కష్టపడతాడో, మైదానంలో కూడా అదే స్థాయిలో తీవ్రంగా శ్రమిస్తాడు. అవసరం లేని సమయంలో కూడా తన శక్తిమేరకు కృషి చేస్తూ జట్టుకు ఆదర్శంగా నిలుస్తాడు' అని ప్రశంసించాడు. అవార్డు అందుకున్న తిలక్ ఆనందం వ్యక్తం చేశాడు. 'జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రయత్నం చేయాలని ఎప్పుడూ భావిస్తాను. మైదానం బయట చేసే కష్టమే మైదానంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ గుర్తింపు నాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది' అని చెప్పాడు.

తొలి టీ20లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం చెలాయించింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ముందుగా జింబాబ్వేను 125/7 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 18 బంతుల్లో అర్ధ శతకం బాదుతూ అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్‌కు భారత టీ20 కెప్టెన్‌గా తొలి విజయం కూడా దక్కింది. రెండో టీ20లో భారత్ 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ 54 రన్స్ చేయగా.. తిలక్ వర్మ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story