VVS Laxman: గౌతమ్ గంభీర్‌కు షాక్.. ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌!

VVS Laxman could continue as India's T20 head coach after the Zimbabwe series. మాజీ దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Rishvik
Published on: 23 July 2026 5:19 PM IST
VVS Laxman
X

VVS Laxman: గౌతమ్ గంభీర్‌కు షాక్.. ఇక టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌!

VVS Laxman: జింబాబ్వే పర్యటనతో భారత టీ20 జట్టుకు మరోసారి తాత్కాలిక హెడ్ కోచ్‌గా మాజీ దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ బాధ్యతలు చేపట్టారు. హరారేలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు హెడ్ కోచ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ విశ్రాంతి తీసుకోవడంతో.. లక్ష్మణ్ టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. కోచ్‌గా సక్సెస్ రికార్డు ఉన్న లక్ష్మణ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జింబాబ్వే సిరీస్ అనంతరం కూడా భారత టీ20 జట్టుకు ఆయనే హెడ్ కోచ్‌గా కొనసాగవచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి.

పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ప్రత్యేక కోచింగ్ వ్యవస్థను అమలు చేసే అవకాశాన్ని బీసీసీఐ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే టీ20 జట్టుకు హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌ను పూర్తి స్థాయి హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకోనున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్‌తో పాటు వన్డే కోచింగ్ బాధ్యతల్లో గౌతమ్ గంభీర్ కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కోచింగ్ మోడల్ అవసరమని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. టీ20 జట్టు బాధ్యతలను లక్ష్మణ్‌కు అప్పగించడం ద్వారా యువ క్రికెటర్ల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

భారత్-జింబాబ్వే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా సీనియర్ జట్టు విదేశీ పర్యటనలు లేదా హెడ్ కోచ్ అందుబాటులో లేని సందర్భాల్లో ఆయన భారత జట్టుకు మార్గనిర్దేశం చేశారు. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలోనూ లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. కోచ్‌గా లక్ష్మణ్ ట్రాక్ రికార్డు బాగుంది. అతడు కోచ్‌గా వెళ్లిన పర్యటనల్లో టీమిండియా విజయాలు అందుకుంది. లక్ష్మణ్ భారత్ తరఫున 132 టెస్టులు, 86 వన్డేలు ఆడాడు. టేస్టులో 8781 రన్స్, వన్డేల్లో 2338 పరుగులు చేశాడు.

2022లో రాహుల్ ద్రవిడ్ భారతదేశానికి హెడ్ కోచ్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఐర్లాండ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉండగా.. వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా నియమితులయ్యారు. అతని కోచింగ్‌లో భారత్ ఆ సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. 2026లో గంభీర్ హెడ్ కోచ్‌గా ఉండగా.. ఐర్లాండ్‌పై భారత్ తొలిసారిగా సిరీస్‌ను కోల్పోయింది. లక్ష్మణ్ 2022 ఆసియా కప్‌లో కూడా భారత్‌కు కోచ్‌గా వ్యవహరించారు. ఆయన కోచింగ్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. ఈ ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. ఆ సమయంలో హెడ్ కోచ్ ద్రవిడ్‌కు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. ఆయన జట్టుతో పాటు ప్రయాణించలేకపోయారు.

చైనాలో జరిగిన 2023 ఆసియా క్రీడల్లో లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశారు. ఆ టోర్నమెంట్‌లో భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. భారత్ ఆ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. లక్ష్మణ్ 2024 జింబాబ్వే పర్యటనకు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యా డు. ఆ పర్యటనలో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌తోనే అభిషేక్ శర్మ అరంగేట్రం చేశాడు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని జట్టు ఈ సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story