VVS Laxman: బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు.. గంభీర్, అగార్కర్ పరిస్థితి ఏంటి?
BCCI Director of Cricket. భారత క్రికెట్‌లో మరో కీలక మార్పుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
VVS Laxman: బీసీసీఐలో వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యతలు.. గంభీర్, అగార్కర్ పరిస్థితి ఏంటి?
VVS Laxman: భారత క్రికెట్‌లో మరో కీలక మార్పుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఏ) అధిపతిగా వ్యవహరిస్తున్న మాజీ భారత క్రికెటర్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్‌కు మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించేందుకు బోర్డు నిర్ణయించినట్లు సమాచారం. లక్ష్మణ్‌ను ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా నియమించేందుకు బీసీసీఐ సిద్ధమయినట్లు సమాచారం.
లక్ష్మణ్ ప్రస్తుతం నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బాధ్యతలను కొనసాగిస్తూనే.. కొత్త హోదాలో భారత క్రికెట్ వ్యవస్థను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లనున్నారట. యువ జట్ల పర్యవేక్షణ, ఆటగాళ్ల రిహాబిలిటేషన్, పురుషుల-మహిళల క్రికెట్‌లో టాలెంట్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లో ఇప్పటికే లక్ష్మణ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇకపై సిబ్బంది నియామకాల్లోనూ ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
వీవీఎస్ లక్ష్మణ్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ మరో రెండేళ్ల పాటు పొడిగించనున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఆయనకు గతంలో లేని ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ అనే కొత్త హోదాను బీసీసీఐ ఇవ్వనుంది. భారత క్రికెట్‌లో సీనియర్ జట్టు నుంచి యువ జట్ల మధ్య సమన్వయం తీసుకురావడమే ఈ కొత్త బాధ్యత ప్రధాన ఉద్దేశం.
సీనియర్ కోచ్‌లు, సెలెక్టర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, యువ ఆటగాళ్ల అభివృద్ధి కార్యక్రమాలను ఒకే దిశలో నడిపించేలా లక్ష్మణ్‌కు బాధ్యతలు ఉండనున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లతో వివిధ స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో.. ఈ పదవికి లక్ష్మణ్ సరైన వ్యక్తిగా బీసీసీఐ బావించిందట.
లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు ఇవ్వనున్న నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే భవిష్యత్తు వంటి అంశాలపై సెలక్షన్ కమిటీ నిర్ణయాలు ఇటీవల చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు గంభీర్ భవిష్యత్తుపైనా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. టెస్టు క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో పరిస్థితి నేపథ్యంలో గంభీర్‌పై ఒత్తిడి పెరిగింది. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ప్రదర్శన కూడా అతడి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అయితే ప్రస్తుతానికి గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ తమ ప్రస్తుత బాధ్యతల్లో కొనసాగడానికి ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం. ఇద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు తమ పదవుల్లో కొనసాగనున్నట్లు బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. కొత్త ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ హోదా ద్వారా లక్ష్మణ్ బాధ్యతలు టీమిండియా హెడ్ కోచ్, సెలక్షన్ కమిటీ చీఫ్ కంటే పై స్థాయిలో ఉండనుంది. అయితే గంభీర్ లేదా అగార్కర్ తక్షణమే తమ పదవులు కోల్పోతారని కాదు.
వారి ప్రస్తుత బాధ్యతలను కొనసాగిస్తూనే.. భారత క్రికెట్‌లోని వివిధ విభాగాలను సమన్వయం చేసే కీలక పాత్రను లక్ష్మణ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లను చిన్న వయసు నుంచే గుర్తించి.. వారికి సరైన శిక్షణ, రిహాబిలిటేషన్, జాతీయ జట్టుకు వెళ్లే మార్గాన్ని మరింత పటిష్టం చేయడంలో ఈ కొత్త వ్యవస్థ ఉపయోగపడే అవకాశం ఉంది. బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత లక్ష్మణ్ బాధ్యతలు, అధికారాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




