BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా తెలుగోడు.. ఇక ఆటగాళ్లకు పండగే!
VVS Laxman as India's next chief selector. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా తెలుగోడు.. ఇక ఆటగాళ్లకు పండగే!
BCCI Chief Selector: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నియమించే అంశంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నట్లు పలు జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ విషయంపై తుది నిర్ణయం సెప్టెంబర్‌లో తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
ప్రస్తుతం వీవీఎస్ లక్ష్మణ్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)కు అధిపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. యువ ఆటగాళ్ల కెరీర్ గ్రోత్, భారత జట్లను తయారు చేయడంలో హైదరాబాద్ సొగసరి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే హెడ్ కోచ్ అందుబాటులో లేని సందర్భాల్లో పలు సిరీస్‌లకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన లక్ష్మణ్.. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించనున్నారు.
వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లు భారత్ ఓడిపోవడంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై వేటు పడుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. గౌతీ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. భారత్ ఏతో పాటు సీనియర్ జట్టుతో విదేశీ పర్యటనలకూ వెళ్లిన అనుభవం లక్ష్మణ్‌కు ఉంది. కాబట్టి ఆ ప్రచారంలో వాస్తవం ఉండొచ్చని అభిమానులూ భావించారు. కానీ ఇప్పుడు కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. లక్ష్మణ్ కోచ్‌గా కాకుండా.. చీఫ్ సెలక్టర్‌గా నియమితులవుతాడని వార్తలు వస్తున్నాయి. మన తెలుగు ప్లేయర్ లక్ష్మణ్‌కు రెండిలో ఎదో ఒక పదవి వచ్చినా మనకు గర్వకారణం. ఆటగాళ్లకు వీవీఎస్ పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు కాబట్టి.. టీమిండియా మరింత పటిష్టంగా మారనుంది.
అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని మరోసారి పొడిగించాలా లేదా కొత్త చీఫ్ సెలెక్టర్‌ను నియమించాలా అనే అంశంపై బీసీసీఐ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అయితే అగార్కర్‌కు మరో అవకాశం కూడా ఉండొచ్చని నివేదికలు పేర్కొన్నాయి. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ వరకు ఆయన పదవీకాలాన్ని పొడిగించే అవకాశాలను కూడా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అగార్కర్ 2023లో భారత జట్టు చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ హయాంలో భారత్ 2024, 2026 టీ20 ప్రపంచ కప్‌లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా గెలుచుకుంది. అంతేకాదు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు విశేష విజయాలు సాధించింది.
భారత టెస్ట్ జట్టులో తరం మార్పును విజయవంతంగా నిర్వహించడంలో కూడా అజిత్ అగార్కర్ సెలక్షన్ కమిటీ కీలక పాత్ర పోషించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ.. జట్టును పునర్నిర్మించే ప్రక్రియను సమర్థంగా ముందుకు తీసుకెళ్లింది. అయితే బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. సెప్టెంబర్‌లో జరిగే చర్చల అనంతరం అగార్కర్ కొనసాగుతారా? లేక వీవీఎస్ లక్ష్మణ్ కొత్త చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపడతారా? అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




