Mukul Chaudhary: 27 బంతుల్లో 54 పరుగులు.. ఎవరీ ముకుల్ చౌదరి..?
Mukul Chaudhary: లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరి కేకేఆర్‌పై సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
Mukul Chaudhary
LSG vs KKR: ఐపీఎల్ అంటేనే అన్ నోన్ ప్లేయర్స్ అన్ స్టాపబుల్‌గా మారే వేదిక. రాత్రికి రాత్రే ఓ సామాన్యుడిని కోట్లాది మంది అభిమానించే స్టార్‌గా మార్చే సత్తా ఈ లీగ్‌కు ఉంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ గూటి నుంచి మరో మెరుపు మెరిసింది. అతనే 21 ఏళ్ల యువ కెరటం ముకుల్ చౌదరి. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో ఓటమి అంచున ఉన్న వేళ.. క్రీజులోకి వచ్చిన ఈ రాజస్థాన్ కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్.
అసంభవాన్ని సుసాధ్యం చేస్తూ..
కోల్‌కతా నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో, 16 ఓవర్లు ముగిసేసరికి 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక మ్యాచ్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ముకుల్ చౌదరి బ్యాట్ పట్టుకొని వచ్చాడు. కేవలం 27 బంతులు.. 2 ఫోర్లు.. ఏకంగా 7 భారీ సిక్సర్లు బాది, 54 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాదు, అసాధ్యమనుకున్న విజయాన్ని లక్నో ఖాతాలో వేశాడు.
ఫ్లడ్ లైట్ల వెలుతురులో రెండోసారే
ఈ మ్యాచ్ అనంతరం ముకుల్ చెప్పిన మాట వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నేను ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆడటం ఇది నా కెరీర్లో కేవలం రెండోసారి మాత్రమే అని ముకుల్ వెల్లడించాడు. డొమెస్టిక్ లెవల్లో కూడా డే-నైట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేని ఓ కుర్రాడు, ప్రపంచ స్థాయి బౌలర్లను చిత్తు చేస్తూ సిక్సర్ల వర్షం కురిపించడం అతనిలోని సహజ సిద్ధమైన ప్రతిభకు నిదర్శనం.
నాన్న మాట కోసం.. పట్టుదలతో పోరాడి
ముకుల్ చౌదరి నేపథ్యం సినిమా కథను తలపిస్తుంది. రాజస్థాన్‌లోని ఝున్ఝును జిల్లా, గుఢాగాడ్జీ అనే చిన్న గ్రామానికి చెందిన ముకుల్‌ను క్రికెటర్‌గా చూడాలనేది అతని తండ్రి బలమైన కోరిక. సీకర్ లోని ఏబీఎస్ క్రికెట్ అకాడమీలో చేర్పించే సమయంలో తండ్రి ఒకటే కండిషన్ పెట్టారట: నువ్వు క్రికెటర్‌గా గౌరవంతో తిరిగి రావాలి.. లేదంటే గ్రామంలో అడుగుపెట్టొద్దు అని ముకుల్ తండ్రి ఖరాఖండిగా చెప్పారట. తండ్రి మాటను శిరోధార్యంగా భావించి, పట్టుదలతో శ్రమించిన ముకుల్.. నేడు ఐపీఎల్ వేదికపై మెరిశాడు.
ప్రతి పైసాకు న్యాయం..
ఈ ఏడాది వేలంలో కేవలం 30 లక్షల బేస్ ప్రైస్‌తో వచ్చిన ముకుల్‌ను, అతని టాలెంట్ గుర్తించిన లక్నో ఏకంగా రూ. 2.60 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. కేవలం బ్యాటరే కాదు, వికెట్ కీపింగ్ చేయగల, వేగంగా బౌలింగ్ వేయగల అరుదైన ఆల్ రౌండర్ ముకుల్. మొదటి మ్యాచ్‌లోనే తనేంటో నిరూపించుకున్న ఈ రాజస్థాన్ డైమండ్ త్వరలోనే టీమిండియా జెర్సీలో మెరవడం ఖాయమని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


