Who is Praful Hinge : ఎవరీ ప్రఫుల్ హింగే? ఫస్ట్ ఓవర్‌లోనే మూడు వికెట్లు.. మొత్తానికి చుక్కలు చూపించాడుగా

Who is Praful Hinge : మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణానికి చెందిన 24 ఏళ్ల ప్రఫుల్ హింగే సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

CR Reddy
Published on: 14 April 2026 6:26 AM IST
Praful Hinge
X

Praful Hinge

Who is Praful Hinge : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఒకే ఒక్క ఓవర్‌తో దేశం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ కెరటం ప్రఫుల్ హింగే. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన ఈ నాగ్‌పూర్ కుర్రాడు, తన తొలి ఓవర్‌లోనే ముగ్గురు బ్యాటర్లను డక్ అవుట్ చేసి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకీ ఎవరీ ప్రఫుల్ హింగే? అతని నేపథ్యం ఏంటి? వివరంగా తెలుసుకుందాం.

అరంగేట్రంలోనే అద్భుత రికార్డు

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 216 పరుగులు చేసిన తర్వాత, అందరూ రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైపు ఆశగా చూశారు. కానీ, బంతిని అందుకున్న ప్రఫుల్ హింగే మైదానంలో మాయాజాలం చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే డేంజరస్ వైభవ్ సూర్యవంశీని డకౌట్ చేశాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో ధ్రువ్ జురెల్, లూయాన్ డ్రీ ప్రిటోరియస్‌లను కూడా పెవిలియన్ పంపాడు. ఒక ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే ముగ్గురు వికెట్లు తీయడం ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి.

చెల్లెలి కష్టం చూసి మారిన ప్రఫుల్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పట్టణానికి చెందిన 24 ఏళ్ల ప్రఫుల్ హింగే సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రఫుల్ కెరీర్‌లో అతని సోదరి పాత్ర చాలా పెద్దది. ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ (CA) చదువుతూ రాత్రంతా కష్టపడేదట. ఆమె పడుతున్న శ్రమను చూసి, తాను కూడా ఏదో ఒక రంగంలో టాప్ పొజిషన్ కు చేరుకోవాలని ప్రఫుల్ పట్టుదల పెంచుకున్నాడు. చదువులో అంతగా రాణించలేకపోయినా, క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఈ స్థాయికి చేరుకున్నాడు.

ఉమేష్ యాదవ్‌తో డ్రెస్సింగ్ రూమ్ షేరింగ్

ప్రఫుల్ హింగే ఆరాధ్య దైవం భారత స్టార్ పేసర్ ఉమేష్ యాదవ్. విదర్భ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ఉమేష్ యాదవ్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాడు. ఉమేష్ స్పీడు, క్రమశిక్షణ చూసి తానూ ఒక స్టార్ బౌలర్ కావాలని కలలు కన్నాడు. తండ్రి మొదట్లో క్రికెట్‌కు ఒప్పుకోకపోయినా, 12 ఏళ్ల వయసులో సమ్మర్ క్యాంప్‌లో ప్రఫుల్ టాలెంటును చూసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వేగంగా బంతులు వేయడం ప్రాక్టీస్ చేశాడు.

ఆక్షన్ రోజున గుడిలో ప్రార్థన

ఐపీఎల్ 2026 ఆక్షన్ జరుగుతున్నప్పుడు ప్రఫుల్ హింగే టీవీ ముందు కూర్చోలేదు. గత సీజన్‌లో ఆక్షన్ లో ఎవరూ తనను కొనకపోవడంతో, ఈసారి తన ఇంటి పక్కన ఉన్న గుడిలోకి వెళ్లి అక్కడ కూర్చుని లైవ్ చూశాడట. ఆ సమయంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తనపై బిడ్ వేసి సొంతం చేసుకుంది. తన మీద నమ్మకం ఉంచిన జట్టుకు, తన అరంగేట్రం మ్యాచ్‌లోనే మర్చిపోలేని విజయాన్ని అందించి ప్రఫుల్ తన సత్తా చాటాడు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story