అనామకుడి చేతిలో అడ్డంగా బుక్కైన రోహిత్, సూర్య.. వేలంలో ఛీ కొట్టినోళ్లకు ఇచ్చిపడేశాడుగా
Saurabh Dubey KKR: క్రికెట్ అనేది అపారమైన అవకాశాల వేదిక అని సౌరభ్ దూబే మరోసారి నిరూపించాడు. వేలంలో ఎవరూ పట్టించుకోని స్థాయి నుంచి, ఒకే ఒక్క వికెట్‌తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే స్థాయికి ఎదగడం అతని పట్టుదలకు నిదర్శనం.
Saurabh Dubey KKR
Saurabh Dubey KKR: ఐపీఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ క్రికెట్ ప్రియులకు అసలైన మజాను అందిస్తోంది. ముఖ్యంగా ముంబై మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడటానికి మైదానానికి పోటెత్తిన అభిమానులకు కేకేఆర్ కొత్త బౌలర్ సౌరభ్ దూబే గట్టి షాకే ఇచ్చాడు. అనామకుడిగా వచ్చి.. రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడి వికెట్ తీసి రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిన సౌరభ్ దూబే ఎవరో ఓసారి చూద్దాం..
మైదానంలో ముంబైని ముంచేసిన కేకేఆర్ వ్యూహం..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రహానే నమ్మకాన్ని నిజం చేస్తూ కేకేఆర్ బౌలర్లు పవర్‌ప్లేలోనే ముంబై ఇండియన్స్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. మూడో ఓవర్లోనే కెమరూన్ గ్రీన్ అద్భుతమైన బౌలింగ్‌తో ర్యాన్ రికెల్టన్, నమన్ ధీర్‌లను ఒకే ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రెండు భారీ సిక్సర్లు బాది మంచి టచ్‌లో కనిపించడంతో ముంబై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.
రోహిత్ వికెట్‌తో ఒక్కసారిగా వెలుగులోకి..
ఇలాంటి ఉత్కంఠభరితమైన సమయంలో, ఇన్నింగ్స్ 4వ ఓవర్ ఐదో బంతికి ఈ 28 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సౌరభ్ దూబే అద్భుతం చేశాడు. దూబే వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడిన రోహిత్ శర్మ, షాట్‌ను సరిగ్గా టైం చేయలేకపోయాడు. గాల్లోకి లేచిన ఆ బంతిని కెమరూన్ గ్రీన్ పరుగెత్తుకుంటూ అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. రోహిత్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌ను కూడా కట్టడి చేయడంతో గూగుల్‌లో ఈ బౌలర్ ఎవరంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున వెతకడం ప్రారంభించారు.
అసలు ఎవరు ఈ సౌరభ్ దూబే? అతని నేపథ్యం ఏంటి?
మహారాష్ట్రలోని వార్ధా ప్రాంతానికి చెందిన సౌరభ్ దూబే, దేశీవాళీ క్రికెట్లో విదర్భ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇతనికి దేశీవాళీ క్రికెట్లో పెద్దగా ఆడిన అనుభవం లేదు. కానీ, 2019లో జరిగిన ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం భారత ‘ఎ’ జట్టుకు ఎంపికైనప్పుడు ఇతని పేరు మొదటిసారి వినబడింది. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన ఆ జట్టులో ఉన్నప్పటికీ, అక్కడ రాణించే అవకాశం దక్కలేదు. ఆ తర్వాత దేశీవాళీ క్రికెట్లో చోటు కోసం మరో రెండేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
2021 విజయ్ హజారే ట్రోఫీలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. ఆ తర్వాత విదర్భ ప్రో టీ20 లీగ్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (2023), యూపీ టీ20 లీగ్‌లలో ఆడినప్పటికీ, స్థిరమైన ప్రదర్శన చేయకపోవడంతో ఏ జట్టులోనూ శాశ్వత స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు.
వేలంలో అమ్ముడుపోని ఆటగాడు.. అదృష్టం తెరిచిన కేకేఆర్ తలుపులు..
సౌరభ్ దూబే ఐపీఎల్ ప్రయాణం 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ప్రారంభమైంది. ఆ సీజన్లో సన్‌రైజర్స్ ఇతడిని కొనుగోలు చేసినప్పటికీ, ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఇవ్వకుండానే 2023 వేలానికి ముందు విడుదల చేసింది. ఇక ఐపీఎల్ 2026 వేలంలో ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు. దీంతో అతను అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి సౌరభ్ దూబే జీవితమే ఒక ఉదాహరణ. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ పేసర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఆకాశ్ దీప్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేకేఆర్ యాజమాన్యం సౌరభ్ దూబేను జట్టులోకి తీసుకుంది. అలా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్న ఈ విదర్భ బౌలర్, ఏకంగా రోహిత్ శర్మ వికెట్ పడగొట్టి తానేంటో నిరూపించుకున్నాడు.
క్రికెట్ అనేది అపారమైన అవకాశాల వేదిక అని సౌరభ్ దూబే మరోసారి నిరూపించాడు. వేలంలో ఎవరూ పట్టించుకోని స్థాయి నుంచి, ఒకే ఒక్క వికెట్‌తో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే స్థాయికి ఎదగడం అతని పట్టుదలకు నిదర్శనం. మరి రాబోయే మ్యాచ్‌ల్లో ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కేకేఆర్ జట్టులో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.




