Yash Raj Punja: ఈ కుర్రాడిపై ఓ కన్నేసి ఉంచండి.. రెండేళ్ల క్రితమే విండీస్ దిగ్గజం జోస్యం!
Yash Raj Punja: కర్ణాటక లెగ్ స్పిన్నర్ యశ్ రాజ్ పుంజా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు.
Yash Raj Punja: ఈ కుర్రాడిపై ఓ కన్నేసి ఉంచండి.. రెండేళ్ల క్రితమే విండీస్ దిగ్గజం జోస్యం!
Yash Raj Punja: కర్ణాటక లెగ్ స్పిన్నర్ యశ్ రాజ్ పుంజా ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. తన నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి.. కీలకమైన రమన్‌దీప్ సింగ్ వికెట్‌ను పడగొట్టాడు. ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్న యశ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతని కనీస ధర అయిన రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే యశ్ ఐపీఎల్‌లో ఆడుతాడని రెండేళ్ల క్రితమే విండీస్ దిగ్గజం జోస్యం చెప్పాడు, ఇపుడు అదే నిజమైంది.
19 ఏళ్ల వయసున్న లెగ్ స్పిన్నర్ యశ్ రాజ్ పుంజా రాజస్థాన్ రాయల్స్ తరపున 'ఇంపాక్ట్ ప్లేయర్'గా బరిలోకి దిగి తన ఐపీఎల్ ప్రయాణాన్ని ఘనంగా చాటాడు. యశ్ అరంగేట్రం చేయగానే.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను పంచుకుంది. వెస్టిండీస్ మాజీ దిగ్గజం, ప్రముఖ కామెంటేటర్ ఇయాన్ బిషప్ రెండేళ్ల క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి.
అప్పట్లో యశ్ కేవలం రాజస్థాన్ జట్టుకు నెట్ బౌలర్‌గా మాత్రమే ఉండేవాడు. చెన్నైకి ప్రయాణిస్తున్న సమయంలో యశ్‌ను కలిసిన బిషప్.. అతనితో దిగిన ఫోటోను షేర్ చేశాడు. 'నిన్న రాజస్థాన్ రాయల్స్ నెట్ బౌలర్ యశ్‌ను కలిశాను. నా ఎత్తు 6 అడుగుల 6.5 అంగుళాలు. కానీ అతను నాకంటే కాస్త ఎత్తుగా ఉన్నాడు. 6 అడుగుల 6 అంగుళాల పొడవు ఉంటాడు. బెంగళూరుకు చెందిన ఈ కుర్రాడిపై ఓ కన్నేసి ఉంచండి' అని పోస్ట్ చేశాడు.
ఇయాన్ బిషప్ మాటలు ఇప్పుడు అక్షరాలా నిజం చేస్తూ.. యశ్ రాజ్ పుంజా రాజస్థాన్ ప్రధాన జట్టులోకి రావడమే కాకుండా అరంగేట్రం కూడా చేసేశాడు. తమపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు యశ్ అద్భుత ప్రదర్శనతో సమాధానం ఇచ్చాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక కీలక వికెట్ పడగొట్టాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 14వ ఓవర్లో రమన్‌దీప్ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేయడం చేసి.. తన కెరీర్‌లో తొలి ఐపీఎల్ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. లెగ్ స్పిన్ వేస్తూ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన యశ్.. భవిష్యత్తులో రాజస్థాన్ తరఫున మరిన్ని మ్యాచులు ఆడనున్నాడు.
మంగళూరుకు చెందిన 19 ఏళ్ల యశ్ రాజ్ పుంజా 2025 మహారాజా కప్ ఎడిషన్‌లో మెరిశాడు. 10 మ్యాచ్‌లలో 12.48 అద్భుతమైన సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో రెండవ స్థానంలో నిలిచాడు. హైట్ అతడికి కలిసొస్తోంది. ఈ లెగ్ స్పిన్నర్ తన గూగ్లీతో పాటు వైవిధ్య బంతులు వేస్తున్నాడు. అదనపు బౌన్స్, బంతిని బాగా టర్న్ చేయగల అతడిలో ఉంది. రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ సారథ్యం వహిస్తున్న రాజస్థాన్ స్పిన్ బౌలింగ్ దళానికి ఈ యువ ఆటగాడు మరింత బలాన్ని చేకూరుస్తాడు.




