IND vs ENG 1st ODI: భారత్, ఇంగ్లండ్‌ తొలి వన్డే.. హార్దిక్ పాండ్యా ఎందుకు ఆడడం లేదు?

Why Is Hardik Pandya Not Playing in IND vs ENG 1st ODI. తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడడం లేదు.

Rishvik
Published on: 14 July 2026 6:39 PM IST
IND vs ENG 1st ODI
X

IND vs ENG 1st ODI: భారత్, ఇంగ్లండ్‌ తొలి వన్డే.. హార్దిక్ పాండ్యా ఎందుకు ఆడడం లేదు?

IND vs ENG 1st ODI: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, ఇంగ్లండ్‌ మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. ఈ వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడడం లేదు. ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. బర్మింగ్‌హామ్‌లో హార్దిక్ బరిలోకి దిగకపోవడంతో అతడి గైర్హాజరుపై అభిమానుల్లో చర్చ మొదలైంది. గాయం కారణంగానే హార్దిక్ ఈ సిరీస్ మొత్తానికి దూరమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే ప్రకటించింది. హార్దిక్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ లేకపోవడం భారత్‌కు లోటేనని చెప్పాలి.

ఐపీఎల్ 2026 ముగిసిన అనంతరం హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి (బ్యాక్ స్పాసమ్స్) నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పునరావాసం పొందుతున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు హార్దిక్ అందుబాటులోకి వచ్చాడని భావించిన సమయంలో మరోసారి కాలి కండరాల (లెగ్ స్ట్రెయిన్) గాయం అతడిని వేధించింది. దీంతో అఫ్గానిస్థాన్‌పై జరిగిన మూడు వన్డేల సిరీస్‌కు దూరమయ్యాడు. అంతేకాదు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా బీసీసీఐ సెలెక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకునే వరకు అతడికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది.

ఐపీఎల్‌ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున వెన్ను నొప్పి కారణంగా కొన్ని మ్యాచులు హార్దిక్ పాండ్యా ఆడని విషయం తెలిసిందే. భారత్ తరఫున ఏడాదికి పైగా విరామం తర్వాత వన్డే ఆడబోతున్న సమయంలో మళ్లీ గాయపడ్డాడు. గాయాలు అతడి కెరీర్‌కు మరో దెబ్బ అనే చెప్పాలి. హార్దిక్ భారత వైట్‌బాల్ జట్టులో కీలక ఆటగాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టడం, చివరి ఓవర్లలో భారీ షాట్లు ఆడడం అతడి బలం. 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్‌మెంట్ జట్టును నిర్మించుకుంటున్న వేళ హార్దిక్ ఫిట్‌నెస్ పెద్ద సమస్యగా మారుతోంది. త్వరలోనే హార్దిక్ జట్టులోకి వస్తాడని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక తొలి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లకు కొంత సహకారం లభిస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మరోవైపు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. తాము కూడా టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం అని చెప్పాడు. టీ20 సిరీస్ తర్వాత ఆటగాళ్లందరూ మంచి సన్నాహకాలు చేశారని, జట్టులో సానుకూల వాతావరణం ఉందని గిల్ వెల్లడించాడు.

తుది జట్లు:

ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: జాకబ్ బెతెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story