Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి భారత్ అడ్డు.. అసలు కారణం ఇదే!
Vaibhav Sooryavanshi: Vaibhav Sooryavanshi's India Debut Delayed. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడం వెనక భారత జట్టు యాజమాన్యం ఓ స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రానికి భారత్ అడ్డు.. అసలు కారణం ఇదే!
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కువగా చర్చిస్తున్న పేరు 'వైభవ్ సూర్యవంశీ'. 15 ఏళ్ల వయసులోనే తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్‌కు భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. అయితే ఐపీఎల్ 2026లో అదరగొట్టిన బుడ్డోడికి ఇప్పటివరకు తుది జట్టులో అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి టీ20 కలిపి వరుసగా మూడు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమవడంపై సోషల్ మీడియాలో చర్చ మరింత పెరిగింది.
సీనియారిటీ క్రమం:
వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడం వెనక భారత జట్టు యాజమాన్యం ఓ స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కారణం.. జట్టులో ఇప్పటికే ఏర్పాటు చేసిన హైరార్కీ (సీనియారిటీ క్రమం)ను కొనసాగించడమేనని సమాచారం. భారత క్రికెట్‌లో దేశవాళీ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరే ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వ్యవస్థను పక్కనపెట్టి.. 15 ఏళ్ల ఆటగాడిని నేరుగా సీనియర్ జట్టులోకి తీసుకురావడం మిగతా ఆటగాళ్లకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సీనియర్ ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలని:
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి బ్యాటర్లు ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో విజయంలో కీలక పాత్ర పోషించారు. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన వారిపై నమ్మకం కోల్పోవద్దనే అభిప్రాయంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే ఇప్పటికే జట్టులో ఉన్న ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వాలని కోచ్ గౌతమ్ గంభీర్, మేనేజ్‌మెంట్ భావిస్తోంది. భారత సహాయ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాడనే విషయంలో ఎలాంటి సందేహం లేదని చెప్పిన ఆయన.. ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ వంటి ఆటగాళ్లకు కూడా తగిన గౌరవం, అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత జట్టుపై ఉందన్నారు.
భద్రతాభావం కల్పిస్తూ అవకాశాలు ఇవ్వాలి:
టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'జట్టులో ఒక్క ఆటగాడు మాత్రమే కాదు.. అందరూ మంచి ప్రదర్శనలు చేశారు. ప్రతి ఆటగాడికి భద్రతాభావం కల్పిస్తూ అవకాశాలు ఇవ్వాలి. గత ప్రపంచకప్‌ను గెలిపించిన ఆటగాళ్లు ఈ ఫార్మాట్‌లో మా ప్రధాన బలాలు. అందుకే వారికి మద్దతుగా నిలవడం చాలా ముఖ్యం' అని ఆయన వెల్లడించాడు. మరోవైపు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి మాత్రం వైభవ్‌కు ఇప్పటికే అవకాశం ఇవ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లు యువ ఆటగాడిని పరీక్షించడానికి సరైన వేదిక అని గవాస్కర్ పేర్కొన్నారు. ఎక్కువకాలం బెంచ్‌పైనే ఉంచితే అరంగేట్రం సమయంలో అతడిపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
సరైన సమయం వచ్చినప్పుడే:
రవి శాస్త్రి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐర్లాండ్‌లోని చిన్న మైదానం, అక్కడి పరిస్థితులు వైభవ్ వంటి దూకుడు బ్యాటర్‌కు అనుకూలంగా ఉండేవని.. అతడికి అవకాశం ఇచ్చి ఉంటే మ్యాచ్‌ను తనదైన శైలిలో మార్చేసేవాడని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ సిరీస్‌లోనైనా వీలైనంత త్వరగా అతడికి అవకాశం ఇవ్వాలని సూచించారు. అయితే ప్రస్తుతం టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం తన విధానానికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతిభపై ఎలాంటి సందేహం లేకపోయినా, సరైన సమయం వచ్చినప్పుడే వైభవ్ సూర్యవంశీకి భారత జట్టు క్యాప్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు సాగుతోంది.




