Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు షాక్.. సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 లో సౌతాఫ్రికా చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మారిజానే కాప్ 81 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆఫ్రికాను గెలిపించింది.
Womens T20 World Cup 2026
Womens T20 World Cup 2026 : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయ పరంపరకు బ్రేక్ పడింది. మాంచెస్టర్‌లోని ప్రసిద్ధ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఈ టోర్నీలో ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధించిన భారత్‌కు ఇది మొదటి ఓటమి కాగా, సౌతాఫ్రికాకు మూడు మ్యాచ్‌ల్లో ఇది రెండో విజయం. సఫారీ ఆల్‌రౌండర్ మారిజానే కాప్ అల్టిమేట్ ఆల్‌రౌండ్ షోతో భారత్ నోటి వద్ద ఉన్న విజయాన్ని లాగేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. పవర్‌ప్లేలో భారత ఓపెనర్లు స్మృతి మంధాన (17), షెఫాలీ వర్మ (31) ధాటిగా ఆడి 6 ఓవర్లలో 2 వికెట్లకు 59 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు రన్స్ చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. యస్తికా భాటియా (15), జెమిమా రోడ్రిగ్స్ (15) తక్కువ స్కోర్లకే అవుట్ కాగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (24), దీప్తి శర్మ (29) క్రీజులో ఉన్నంతసేపు బంతులను వృథా చేశారు. దీనితో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆఫ్రికా బౌలర్లలో మారిజానే కాప్, షబ్నీమ్ ఇస్మాయిల్‌లు చెరో 2 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించారు.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆఫ్రికా జట్టు 2 వికెట్లు కోల్పోయి కేవలం 25 పరుగులు మాత్రమే చేసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన మారిజానే కాప్.. తాజ్మిన్ బ్రిట్స్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. బ్రిట్స్ అవుట్ అయిన తర్వాత కాప్ మరింత రెచ్చిపోయి ఆడింది. భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుని మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించింది. కేవలం 45 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 81 పరుగులు చేసి, మరో 5 బంతులు మిగిలి ఉండగానే 19.1 ఓవర్లలోనే ఆఫ్రికాను విజయతీరాలకు చేర్చింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కాప్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
సౌతాఫ్రికా చేతిలో ఎదురైన ఈ ఓటమి కారణంగా గ్రూప్-1 లో భారత్ రన్ రేట్ స్వల్పంగా దెబ్బతింది. భారత్ సెమీఫైనల్స్ చేరాలంటే రాబోయే మ్యాచ్‌ల్లో తప్పకుండా భారీ విజయాలు సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడంపై హర్మన్‌ప్రీత్ సేన దృష్టి పెట్టాలి. బ్యాటింగ్‌లో మిడిల్ ఓవర్లలో పరుగులు రాకపోవడం, బౌలింగ్‌లో కాప్ ఇచ్చిన క్యాచ్‌లను చేజార్చడం వంటి తప్పులను సరిదిద్దుకుంటేనే రాబోయే మ్యాచ్‌ల్లో భారత్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.




