Womens T20 WC 2026 : వరల్డ్ కప్‌లో భారత్ కథ ముగిసింది.. ఆసిస్ చేతిలో ఓటమితో సెమీస్ ఆశలు గల్లంతు

Womens T20 WC 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా సెమీఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.

CR Reddy
Published on: 29 Jun 2026 6:20 AM IST
Women T20 World Cup 2026
X

Women T20 World Cup 2026

Womens T20 WC 2026 : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత అభిమానులకు తీరని నిరాశ ఎదురైంది. కప్ కొడతారనుకున్న మన అమ్మాయిల ప్రయాణం గ్రూప్ స్టేజ్‌లోనే ముగిసిపోయింది. లార్డ్స్ మైదానంలో జరిగిన అత్యంత కీలకమైన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో 6 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఘోర పరాజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. భారత్ ఓడిపోవడంతో సౌతాఫ్రికా జట్టుకు సెమీఫైనల్ టికెట్ లభించగా.. ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా నేరుగా సెమీస్‌కు దూసుకెళ్లింది.

సౌతాఫ్రికాకు కలిసొచ్చిన భారత్ ఓటమి

ఈ మ్యాచ్‌పై కేవలం భారత అభిమానులకే కాకుండా, సౌతాఫ్రికా టీమ్‌కు కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆస్ట్రేలియా అప్పటికే సెమీస్‌కు చేరిపోగా.. రెండో స్థానం కోసం భారత్, సౌతాఫ్రికా మధ్య గట్టి పోటీ నడిచింది. భారత్ మ్యాచ్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందే సౌతాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి 8 పాయింట్లతో రేసులో నిలిచింది. అయితే రన్ రేట్ పరంగా భారత్ మెరుగ్గా ఉండడం వల్ల.. ఆస్ట్రేలియాపై కేవలం గెలిస్తే చాలు భారత్ సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఆ గెలుపును అందుకోవడంలో మన జట్టు విఫలమైంది.

కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సిక్సర్ల వర్షం

టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ (34) జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా షెఫాలీ బౌండరీలతో వేగంగా రన్స్ రాబట్టింది. అయితే పవర్‌ప్లే ముగిశాక ఇద్దరి రన్ రేట్ బాగా తగ్గిపోయింది. 10వ ఓవర్లో 66 రన్స్ వద్ద మొదటి వికెట్ పడింది. స్మృతి మంధాన 37 బంతుల్లో 38 రన్స్ చేసి రనౌట్ అయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లీడ్ తీసుకుంది. జెమిమా రోడ్రిగ్స్ (34)తో కలిసి ఇన్నింగ్స్ నడిపించింది. ఆఖరి ఓవర్లో హర్మన్‌ప్రీత్ వరుసగా 3 సిక్సర్లు బాది కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. దీంతో భారత్ 170 రన్స్ భారీ స్కోరు సాధించింది.

టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన ఎల్లీస్ పెర్రీ, గార్డనర్ జోడీ

171 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. తొలి వికెట్ త్వరగానే పడిపోయినా.. ఆసీస్ బ్యాటర్లు చిన్న చిన్న భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. 10వ ఓవర్లో బెత్ మూనీ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోరు 3 వికెట్లకు 68 రన్స్ మాత్రమే. మ్యాచ్ భారత్ చేతుల్లోకి వస్తుందనుకున్న తరుణంలో.. మహిళల క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఎల్లీస్ పెర్రీ, ఆష్లీ గార్డనర్‌లు క్రీజులో పాతుకుపోయారు. ఈ ఇద్దరూ భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు.

ఆసీస్ చేతిలో భారత్ పరాజయం

ఎల్లీస్ పెర్రీ, గార్డనర్ జోడీ వికెట్ పడకుండా అడ్డుకుంటూనే ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 100 రన్స్ అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ నుండి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. పెర్రీ 38 బంతుల్లో 56 రన్స్ చేయగా.. గార్డనర్ 29 బంతుల్లో 53 రన్స్‌తో అదరగొట్టింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు కేవలం 19 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మన అమ్మాయిల వరల్డ్ కప్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story