Womens T20 World Cup 2026 : నేటి నుంచి జూలై 5 వరకు మహిళల టీ20 వరల్డ్ కప్.. విజేత ప్రైజ్ మనీ ఎంతో తెలుసా ?
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఐసీసీ ప్రైజ్ మనీని భారీగా పెంచింది. విజేతకు రూ.22 కోట్లు, రన్నరప్‌కు రూ.11 కోట్లు దక్కనున్నాయి.
Womens T20 World Cup 2026
Womens T20 World Cup 2026 : ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌కు రోజురోజుకూ ఆదరణ, క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. మహిళా క్రికెటర్ల ప్రతిభకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో ఐసీసీ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్, వేల్స్ జట్ల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 12 నుంచి ప్రారంభం కాబోతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2026 బహుమతి మొత్తాన్ని ఊహించని స్థాయిలో భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. మహిళల క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక బిగ్గెస్ట్ మైలురాయిగా నిలవనుంది.
ఛాంపియన్లకు కాసుల వర్షం.. రన్నరప్‌కు భారీ నజరానా
ఈ ఏడాది జూన్ 12 నుండి జూలై 5 వరకు జరగబోయే ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నమెంట్‌లో విజేతగా నిలిచి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడే జట్టుకు ఐసీసీ ఏకంగా 2.34 మిలియన్ డాలర్లు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.22 కోట్లకు పైగా ప్రైజ్ మనీని బహుమతిగా ఇవ్వనుంది. అలాగే ఫైనల్ చేరి రన్నరప్‌గా (ఉపవిజేత) నిలిచే దురదృష్టకర జట్టుకు కూడా 1.17 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11 కోట్లు) లభించనున్నాయి. గతంతో పోలిస్తే ఈ బహుమతి నిధుల పూల్ చాలా రెట్లు పెరగడం గమనార్హం.
ఓడిపోయినా దక్కనున్న కోట్ల రూపాయల ఫీజు
ఈ మెగా టోర్నీలో కేవలం నౌకౌట్ మ్యాచ్‌లకు మాత్రమే కాకుండా, లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించే జట్లకు కూడా ఐసీసీ గట్టి భరోసా ఇచ్చింది. టోర్నమెంట్‌లో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస భాగస్వామ్య రుసుముగా 247,500 డాలర్లు అంటే సుమారు రూ.2 కోట్లను ఖరారు చేసింది. దీనితో పాటు సెమీఫైనల్స్ వరకు దూసుకొచ్చి అక్కడ ఓటమిపాలయ్యే జట్లకు కూడా ఖాళీ చేతులతో పంపకుండా.. ఒక్కో జట్టుకు దాదాపు రూ.6.56 కోట్ల భారీ నగదు బహుమతిని అందజేయనుంది.
లీగ్ స్టేజ్‌లో ప్రతి గెలుపుకూ ప్రత్యేక బోనస్
ఐసీసీ ఈసారి లీగ్ స్టేజ్ మ్యాచ్‌లను మరింత రసవత్తరంగా మార్చడానికి ఒక అదిరిపోయే ప్లాన్ వేసింది. గ్రూప్ స్టేజ్ మ్యాచుల సమయంలో జట్లు సాధించే ప్రతి ఒక్క విజయానికి ప్రత్యేకంగా బోనస్ మనీని ఇస్తారు. లీగ్ దశలో ఒక మ్యాచ్ గెలిచిన ప్రతిసారీ సదరు జట్టుకు అదనంగా దాదాపు రూ.29 లక్షల నగదు లభిస్తుంది. కాగా గతేడాది వన్డే వరల్డ్ కప్ సాధించి ఫుల్ జోష్ లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు.. ఈసారి ఎలాగైనా తమ మొదటి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కూడా కొట్టి చరిత్ర సృష్టించాలని పట్టుదలతో ఉంది. భారత్ ఈ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
చరిత్రలో తొలిసారి 12 జట్ల మధ్య పోరు
మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టోర్నమెంట్ పరిధిని విస్తరించారు. ఎప్పుడూ ఆడే 10 జట్లకు బదులుగా ఈసారి ఏకంగా 12 జట్లు రంగంలోకి దిగుతున్నాయి. ఈ 12 జట్లను చెరో ఆరు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ ముగిసేసరికి రెండు గ్రూపుల నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇంగ్లాండ్‌లోని 7 వేర్వేరు చారిత్రాత్మక మైదానాల్లో మొత్తం 33 మ్యాచ్‌ల పాటు ఈ క్రికెట్ పండుగ సాగనుంది.
వరల్డ్ కప్ 2026 గ్రూపుల వివరాలు ఇవే:
గ్రూప్ 1: భారతదేశం, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్ 2: ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్.




