Womens T20 World Cup 2026 : బంగ్లాదేశ్‌పై గెలిచినా తప్పని తిప్పలు.. టీమిండియా ఆశలన్నీ ఆ ఒక్క మ్యాచ్‌పైనే
Womens T20 World Cup 2026 : మహిళా టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచినా భారత్ సెమీస్ రేస్ ఉత్కంఠగా మారింది. సౌతాఫ్రికా ముప్పును తప్పించుకోవడానికి భారత్, బంగ్లాదేశ్ వైపు చూస్తోంది.
Womens T20 World Cup 2026
Womens T20 World Cup 2026 : ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఉత్కంఠభరితంగా సాగుతోంది. వన్డే వరల్డ్ కప్ సాధించిన జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు, ఇప్పుడు తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ను కూడా ముద్దాడాలని పట్టుదలగా ఉంది. టోర్నమెంట్‌లో భాగంగా తాజాగా జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తన మూడవ విజయాన్ని నమోదు చేసింది. ఈ గెలుపుతో సెమీఫైనల్ చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకున్నప్పటికీ, గ్రూప్ సమీకరణాల కారణంగా భారత్‌కు ఇంకా లైన్ క్లియర్ కాలేదు. సౌతాఫ్రికా రూపంలో భారత్‌కు గట్టి ముప్పు పొంచి ఉంది.
ఈ మెగా టోర్నీలో భారత జట్టు అత్యంత కఠినమైన గ్రూప్-1లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు పటిష్టమైన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు కూడా ఉన్నాయి. భారత్ ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి 6 పాయింట్లతో ఉంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని 136 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా, అనంతరం 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంది. అయితే భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను టేబుల్ టాపర్ ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా ఇప్పటికే వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. కాబట్టి భారత్ సెమీస్ చేరాలంటే కంగారూలను కచ్చితంగా ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్‌కు అసలైన తలనొప్పి సౌతాఫ్రికా జట్టు వల్లే వస్తోంది. సౌతాఫ్రికా ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలిచింది. ఇందులో ఒక విజయం భారత్‌పైనే సాధించడం గమనార్హం. ప్రస్తుతం సౌతాఫ్రికాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. అవి కూడా టోర్నీలోనే బలహీనమైన జట్లుగా భావించే నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లతో జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ సౌతాఫ్రికా ఈజీగా గెలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సౌతాఫ్రికా ఆ రెండు మ్యాచ్‌లు గెలిచి, భారత్ తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే.. భారత్ 6 పాయింట్లతో ఇంటిబాట పడుతుంది, సౌతాఫ్రికా 8 పాయింట్లతో సెమీస్‌కు వెళ్తుంది.
ఒకవేళ భారత్ తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి, ఇటు సౌతాఫ్రికా కూడా తన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే.. అప్పుడు ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా మూడు జట్లు కూడా తలా 8 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు సెమీఫైనల్ గ్రూప్ విజేతలను నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్రకటిస్తారు. ప్రస్తుతం రన్‌రేట్ పరంగా ఆస్ట్రేలియా (+4.724) మొదటి స్థానంలో, భారత్ (+2.268) రెండో స్థానంలో బలంగా ఉన్నాయి. సౌతాఫ్రికా (-0.546) చాలా వెనుకబడి ఉంది. ఒకవేళ సౌతాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌లను భారీ తేడాతో గెలిస్తేనే రన్‌రేట్ రేసు ఆసక్తికరంగా మారుతుంది, లేదంటే భారత్‌కే ప్లస్ అవుతుంది.
ఈ రన్‌రేట్ తలనొప్పులు ఏమీ లేకుండా భారత్ సేఫ్‌గా సెమీస్ చేరాలంటే ఒక అద్భుతం జరగాలి. జూన్ 28న జరగబోయే కీలక మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు సౌతాఫ్రికాను ఓడించాలి. ఒకవేళ బంగ్లాదేశ్ గెలిస్తే, సౌతాఫ్రికా రేసు నుంచి తప్పుకుంటుంది. అప్పుడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ భారత్, సౌతాఫ్రికా రెండు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోయినా కూడా రన్‌రేట్ ఆధారంగా భారత్‌కే సెమీస్ టికెట్ దక్కుతుంది. అందువల్ల, నిన్నటివరకు తాము ఓడించిన బంగ్లాదేశ్ జట్టు, ఇప్పుడు సౌతాఫ్రికాను ఓడించాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.




