Vinesh Phogat: రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై డబ్ల్యూఎఫ్ఐ వేటు
Vinesh Phogat: ప్రముఖ భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Vinesh Phogat: రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై డబ్ల్యూఎఫ్ఐ వేటు
Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) షాక్ ఇచ్చింది. క్రమశిక్షణారాహిత్యం మరియు డోపింగ్ నిరోధక నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనితో పాటు జూన్ 26 వరకు దేశీయ పోటీల్లో పాల్గొనకుండా ఆమెపై అనర్హత వేటు వేసింది.
ఈ నిర్ణయంతో ఉత్తరప్రదేశ్‌లోని గొండాలో మే 10 నుంచి 12 వరకు జరగనున్న 'జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీ'లో వినేశ్ పాల్గొనే అవకాశం కోల్పోయింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం.. పదవీ విరమణ నుంచి తిరిగి పోటీల్లోకి వచ్చే ముందు ఇవ్వాల్సిన ఆరు నెలల నోటీసు వ్యవధిని పూర్తి చేయడంలో వినేశ్ విఫలమైందని WFI స్పష్టం చేసింది. వినేశ్ ప్రవర్తన భారత రెజ్లింగ్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని సమాఖ్య ఆరోపించింది.
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ సొంత ఊరిలో ఈ పోటీలు నిర్వహిస్తుండటంపై వినేశ్ ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిజ్‌భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన వారిలో తాను కూడా ఉన్నానని, అక్కడ పోటీ చేయడం మానసిక ఒత్తిడికి గురిచేస్తుందని ఆమె పేర్కొన్నారు. అక్కడ తమకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. అయితే, ఈ ఆరోపణల నేపథ్యంలోనే పోటీలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందే సమాఖ్య ఆమెపై ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హురాలిగా వేటు పడటంతో పాటు మరికొన్ని ప్రధాన అంశాలపై వివరణ ఇవ్వాలని WFI వినేశ్‌ను ఆదేశించింది. ఈ పరిణామం భారత రెజ్లింగ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.




