WTC Points Table: వెస్టిండీస్ చేతిలో ఓటమి.. డబ్ల్యూటీసీ పట్టికలో పాతాళానికి పాకిస్థాన్.. ఇక కష్టమే!
WTC Points Table: Pakistan crashed to the bottom of the WTC 2025-27 points table. తొలి టెస్టులో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్.. డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో పాతాళానికి పడిపోయింది.
WTC Points Table: వెస్టిండీస్ చేతిలో ఓటమి.. డబ్ల్యూటీసీ పట్టికలో పాతాళానికి పాకిస్థాన్.. ఇక కష్టమే!
WTC Points Table: దాయాది పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ట్రినిడాడ్‌లో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ చేతిలో 90 పరుగుల తేడాతో ఓడిపోయిన పాకిస్థాన్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్‌లో పాతాళానికి పడిపోయింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ అజేయంగా 58 పరుగులు చేసి పోరాడినా.. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమవడంతో పాకిస్థాన్ ఓటమిని తప్పించుకోలేకపోయింది.
వెస్టిండీస్‌పై పరాజయంతో పాకిస్థాన్ 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. పాక్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక విజయమే నమోదు చేసింది. నాలుగు పరాజయాలతో కేవలం 6.66 విజయ శాతాన్ని మాత్రమే కలిగి ఉంది. డబ్ల్యూటీసీ సైకిల్‌లో తొమ్మిది జట్లు ఉండగా.. పాక్ పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. మరోవైపు వెస్టిండీస్ ఈ విజయంతో 12 పాయింట్లు సాధించి.. రెండో విజయాన్ని నమోదు చేసింది. అయినప్పటికీ 22.73 శాతంతో ఎనిమిదో స్థానంలోనే కొనసాగుతోంది.
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, ఒకే ఒక్క ఓటమితో 87.50 విజయ శాతంను నమోదు చేసింది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా (75), మూడో స్థానంలో న్యూజిలాండ్ (72.22) ఉన్నాయి. నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ (58.33) నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టీమిండియా ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు, నాలుగు ఓటములు, ఒక డ్రాతో 48.15 విజయ శాతం సాధించింది.
భారత్ తర్వాత స్థానంలో శ్రీలంక (41.67) ఆరో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్ (24.36) ఏడో స్థానంలో ఉంది. ఓవర్‌రేట్ పెనాల్టీల కారణంగా ఇంగ్లండ్ పాయింట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమితో పాకిస్థాన్‌పై ఇప్పుడు ఒత్తిడి మరింత పెరిగింది. రెండో టెస్టులో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌తో పాటు మిగతా జట్లు కూడా రాబోయే సిరీస్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీమ్స్ మంచి స్థితిలో ఉన్నాయి. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. ఆ రెండు జట్లే ఫైనల్ ఆడనున్నాయి.
తాజా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక:
ఆస్ట్రేలియా – 87.50% (84 పాయింట్లు)
దక్షిణాఫ్రికా – 75.00% (36 పాయింట్లు)
న్యూజిలాండ్ – 72.22% (52 పాయింట్లు)
బంగ్లాదేశ్ – 58.33% (28 పాయింట్లు)
భారత్ – 48.15% (52 పాయింట్లు)
శ్రీలంక – 41.67% (20 పాయింట్లు)
ఇంగ్లండ్ – 24.36% (38 పాయింట్లు)
వెస్టిండీస్ – 22.73% (30 పాయింట్లు)
పాకిస్థాన్ – 6.66% (8 పాయింట్లు)




