Ashwin: నన్ను చాలా నిరాశకు గురిచేశావ్.. సూర్యవంశీకి అశ్విన్ క్లాస్!

Ashwin: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్లాస్ పీకాడు.

Rishvik
Published on: 2 Jun 2026 6:49 PM IST
Ashwin
X

Ashwin: నన్ను చాలా నిరాశకు గురిచేశావ్.. సూర్యవంశీకి అశ్విన్ క్లాస్!

Ashwin: ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్లాస్ పీకాడు. టోర్నీలో సిక్సర్ల వర్షం కురిపించి 'సూపర్ స్ట్రైకర్', 'సూపర్ సిక్సెస్' అవార్డులు గెలుచుకున్న వైభవ్‌ను ప్రశంసించిన అశ్విన్.. సూపర్ ఫోర్స్ అవార్డు విషయంలో మాత్రం తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎప్పుడూ గాల్లోనే కాదు, గ్రౌండ్‌పైనా ఆడు అంటూ సూచనలు ఇచ్చాడు. సూపర్ ఫోర్స్ అవార్డు విషయంలో వైభవ్ తనను నిరాశకు గురిచేశాడు అంటూ యాష్ పేర్కొన్నాడు.

సూపర్ ఫోర్స్ అవార్డు మిస్ చేశావు:

వైభవ్‌ సూర్యవంశీతో జరిగిన సంభాషణలో ఆర్ అశ్విన్ మాట్లాడుతూ.. 'నువ్వు సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులు గెలిచావు. చాలా సంతోషం. కానీ సూపర్ ఫోర్స్ అవార్డు మాత్రం చేజారిపోయింది. అది చూసి నాకు కొంచెం నిరాశ కలిగింది. ఎప్పుడూ గాల్లోనే షాట్లు ఆడకుండా.. కొంత సమయం గ్రౌండ్ షాట్లకు కూడా కేటాయించు' అంటూ సరదాగా సూచించాడు. అశ్విన్ వ్యాఖ్యలకు స్పందించిన వైభవ్.. భవిష్యత్తులో తన ఆటలో మార్పులు కనిపిస్తాయని తెలిపాడు. 'అవును, ఇకపై గ్రౌండ్ షాట్లపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే నా తదుపరి అసైన్‌మెంట్ వన్డే ఫార్మాట్‌లో ఉంది. రెడ్ బాల్‌తో కూడా నేను చాలా ప్రాక్టీస్ చేశాను. కానీ ఇప్పటివరకు ఎవరూ దాన్ని చూడలేదు. త్వరలోనే అందరూ చూస్తారు' అని చెప్పాడు.

అది బలవంతం వల్ల కాదు:

తన బ్యాటింగ్ శైలిపై వస్తున్న విమర్శలకు కూడా వైభవ్ సూర్యవంశీ సమాధానం ఇచ్చాడు. 'చాలా మంది నేను ప్రతి బంతినీ బలంగా కొట్టాలని ప్రయత్నిస్తానని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇది టీ20 ఫార్మాట్. ఈ ఫార్మాట్‌లో కోచ్‌లు నాకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చారు. నేను కొట్టగలననే నమ్మకం ఉన్న బంతులనే భారీ షాట్లు ఆడతాను. అది బలవంతం వల్ల కాదు, నా సామర్థ్యంపై నాకున్న నమ్మకం' అని స్పష్టం చేశాడు.

నా లక్ష్యం అదే:

ఐపీఎల్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. తాను కేవలం టీ20 బ్యాటర్ మాత్రమే కాదని, వన్డేలు మరియు రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు ఇచ్చాడు. బుడ్డోడి సమాధానాలు చూస్తే.. భవిష్యత్తులో మరింత పరిణతి చెందిన బ్యాటర్‌గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. త్వరలో ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే సిరీస్‌లకు వైభవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 పరుగులు బాదిన వైభవ్.. ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. బుడ్డోడి దూకుడైన బ్యాటింగ్, అసాధారణ స్ట్రైక్‌రేట్ బీసీసీఐ సెలెక్టర్లను ఆకట్టుకుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story