Yuzvendra Chahal: ఎంత పని చేశావ్ అర్ష్‌దీప్ సింగ్.. అడ్డంగా దొరికిపోయిన చాహల్
Yuzvendra Chahal: ఐపీఎల్ 2026లో రియాన్ పరాగ్ తర్వాత ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్ వేపింగ్ వివాదంలో చిక్కుకున్నారు.
Yuzvendra Chahal: ఎంత పని చేశావ్ అర్ష్‌దీప్ సింగ్.. అడ్డంగా దొరికిపోయిన చాహల్
Chahal Caught Vaping: ఐపీఎల్ అంటేనే గ్లామర్, యాక్షన్, ఎమోషన్. కానీ ఈ సీజన్‌లో వీటన్నింటినీ మించి ఈ-సిగరెట్ చర్చనీయాంశమవుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ సరదాగా ఒక వ్లాగ్ చిత్రీకరించాడు. ఆటగాళ్లంతా సరదాగా ముచ్చటించుకుంటున్న సమయంలో, చాహల్ వేపింగ్ చేస్తున్నట్లు కొన్ని దృశ్యాలు రికార్డు అయ్యాయి. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విమర్శలు గుప్పించారు. వివాదం ముదురుతోందని గ్రహించిన టీమ్ మేనేజ్‌మెంట్.. వెంటనే ఆ వ్లాగ్‌లోని వివాదాస్పద దృశ్యాలను ఎడిట్ చేసి తొలగించినట్లు సమాచారం. అయితే, అప్పటికే స్క్రీన్‌షాట్‌లు నెట్టింట వైరల్ కావడంతో చాహల్ తీరుపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
రియాన్ పరాగ్ ఉదంతం మరువక ముందే..
కొద్ది రోజుల క్రితమే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కెమెరాకు దొరికిపోయాడు. దీనిపై బీసీసీఐ సీరియస్ అయ్యి, అతనికి 25 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించింది. ఇప్పుడు చాహల్ విషయంలో కూడా అలాంటి చర్యలే ఉంటాయా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు పంజాబ్ ఫ్రాంచైజీ గానీ, చాహల్ గానీ ఈ విషయంపై మౌనం వీడలేదు. ఈ వేపింగ్ కల్చర్‌పై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. ఒక అన్నయ్యలా యువ ఆటగాళ్లకు హితవు పలికాడు.
వ్యక్తిగత ఎంపికలు ఏవైనా కావచ్చు, కానీ వాటిని పబ్లిక్ స్పేస్‌లో ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. లక్షలాది మంది యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఒక ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాలి అని అశ్విన్ సూచించారు. క్రీడాకారులు అంటే కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు, వారు ఒక బ్రాండ్ అంబాసిడర్లు. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు లేదా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నప్పుడు కెమెరాలు ఎప్పుడూ ఆన్‌లో ఉంటాయన్న స్పృహ మర్చిపోవడం ఆటగాళ్లకే నష్టం. క్రమశిక్షణే ప్రాణంగా భావించే క్రికెట్‌లో ఇలాంటి ధోరణులు పెరుగుతుండటం క్రీడాభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.




