Mohammed Shami: మహమ్మద్ షమీకి కాదు బీసీసీఐకే నష్టం.. జహీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు!
Zaheer Khan backs Mohammed Shami to keep fighting for a Team India comeback. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ భవిష్యత్తుపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది.
Mohammed Shami: మహమ్మద్ షమీకి కాదు బీసీసీఐకే నష్టం.. జహీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు!
Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ భవిష్యత్తుపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టు సన్నాహకాలు ప్రారంభమైనప్పటికీ.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాత్రం అతడిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. జస్ప్రీత్ బుమ్రా సహా పలువురు భారత పేసర్లు గాయాలతో ఇబ్బందులు పడుతున్నా.. షమీకి మాత్రం టీమిండియాలోకి తిరిగి వచ్చే ఛాన్సెస్ దాదాపుగా లేవు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్టార్ పేసర్ జహీర్ ఖాన్.. షమీకి కీలక సూచనలు చేశాడు. భారత జట్టు ఎంట్రీ ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని, నిరంతరం పోరాడుతూనే ఉండాలని చెప్పాడు. 2027 వన్డే ప్రపంచ కప్‌కు షమీని ఎంపిక చేయకుంటే.. బీసీసీఐకే పెద్ద నష్టం అని జహీర్ చెప్పుకొచ్చాడు.
మహమ్మద్ షమీ ప్రస్తుతం భారత జట్టులో లేకపోయినా.. దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడుతూ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులోకి ఎంపిక చేస్తారా లేదా అనే దానికంటే.. తన చేతుల్లో ఉన్న అంశాలపై దృష్టి పెట్టడం ముఖ్యమని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. జట్టు ఆలోచనా విధానం వేరుగా ఉన్నప్పటికీ.. ఆటగాడిగా షమీ తన ప్రయత్నాలను కొనసాగించాలని సూచించాడు. 'మీరు ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారనేది మీ నిర్ణయం. మ్యాచ్‌లు ఆడుతూ బాగా ప్రదర్శన చేస్తే మీరు అందుబాటులో ఉన్న ఆటగాడిగానే ఉంటారు. ప్రస్తుతం జట్టు ఆలోచనా విధానం వేరుగా ఉండొచ్చు. కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారనేది ముఖ్యం. జట్టుకు సహకరించాలనుకుంటే అది మీ నిర్ణయం. ప్రస్తుతం షమీ చేస్తున్నదే సరైన పని. అతడు మ్యాచ్‌లు ఆడుతున్నాడు. నిరూపించుకుంటున్నాడు. అది చాలా ముఖ్యం' అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు.
బీసీసీఐ సెలెక్టర్ల నిర్ణయంపై ఆందోళన చెందకుండా.. నిరంతరం క్రికెట్ ఆడుతూ మంచి ప్రదర్శన చేయడం ద్వారా అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని షమీకి జహీర్ సూచించాడు. 'జాతీయ జట్టులోకి ఎప్పుడు పిలుపు వస్తుందనేది ఆటగాడి చేతుల్లో ఉండదు. అయితే ఫిట్‌నెస్, ప్రదర్శన, మ్యాచ్ ప్రాక్టీస్ వంటి అంశాలను మాత్రం ఆటగాడు నియంత్రించగలడు. జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా తదితర ఆటగాళ్లు వివిధ సందర్భాల్లో ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. క్రికెట్‌లో గాయాలు సహజమే. ప్రతి ఆటగాడి ప్రయాణంలోనూ గాయాలు ఎదురవుతాయి. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడొచ్చు. అయితే పరిస్థితులు, సమయం కూడా చాలా ముఖ్యమైనవి. ఫాస్ట్ బౌలర్ గాయపడినా లేదా క్లిష్ట దశను ఎదుర్కొన్నా.. మన చేతుల్లో ఉన్న అంశాలను నియంత్రించడం చాలా ముఖ్యం. గాయానికి అసలు కారణం ఏమిటో తెలుసుకునే వరకు ముందుకు వెళ్లడం కష్టం' అని జహీర్ వివరించాడు.
ప్రస్తుతం భారత జట్టు 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని పేస్ బౌలింగ్ విభాగంలో పలువురు ఆటగాళ్లను పరిశీలిస్తోంది. బుమ్రా ఫిట్‌నెస్, ఇతర పేసర్ల గాయాలు వంటి అంశాల నేపథ్యంలో షమీ అనుభవం టీమిండియాకు ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ.. తుది నిర్ణయం మాత్రం సెలెక్టర్లదే. ఈ నేపథ్యంలో జహీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు షమీకి ధైర్యాన్ని ఇవ్వనున్నాయి. ప్రస్తుతం షమీ చేయాల్సిందొక్కటే.. మ్యాచ్‌లు ఆడుతూ ఫిట్‌గా ఉండి, తన ప్రదర్శనతో సెలెక్టర్లకు సమాధానం ఇవ్వడం. షమీ జాతీయ జట్టులోకి తిరిగి వస్తాడా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరికొన్ని రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.




