Zimbabwe History: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. టెస్టు క్రికెట్‌లోనే అతిపెద్ద విజయం!
Zimbabwe History: జింబాబ్వే క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.
Zimbabwe History: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. టెస్టు క్రికెట్‌లోనే అతిపెద్ద విజయం!
Zimbabwe History: జింబాబ్వే క్రికెట్ జట్టు చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. హరారే వేదికగా ముగిసిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్‌ను ఇన్నింగ్స్ 85 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి.. అరుదైన ఘనత సాధించింది. టెస్టు క్రికెట్‌లో జింబాబ్వేకు ఇది అతిపెద్ద విజయంగా రికార్డుల్లో నిలిచింది.
అంతేకాకుండా బంగ్లాదేశ్‌పై గత మూడు టెస్టుల్లో రెండో విజయాన్ని నమోదు చేసిన జింబాబ్వే.. తన సత్తాను మరోసారి క్రికెట్ ప్రపంచంకు చూపించింది. స్వదేశంలో అద్భుత ప్రదర్శనతో అభిమానులకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన జింబాబ్వే.. భవిష్యత్తు టెస్టు సిరీస్‌లకు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది.
జింబాబ్వే బౌలర్లు చెలరేగడంతో మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ బ్యాటర్లు తడబడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా 185 పరుగులకే ఆలౌట్ అయింది. జింబాబ్వే బౌలర్లు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. తొలి ఇన్నింగ్స్‌లోబంగ్లాదేశ్‌ను 140 పరుగులకు ఆలౌట్ చేసిన జింబాబ్వే.. అనంతరం ఇన్నోసెంట్ కాయా అద్భుత శతకంతో 410 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
దీంతో 270 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆతిథ్య జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. జింబాబ్వే విజయంలో పేసర్లు కీలక పాత్ర పోషించారు. బ్లెసింగ్ ముజరబాని నాలుగు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ రిచర్డ్ నగరవా మూడు వికెట్లతో చెలరేగాడు. వీరిద్దరి బౌలింగ్‌కు బంగ్లాదేశ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు.
రెండో ఇన్నింగ్స్‌లో 40/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్ 22 పరుగుల వద్ద ముజరబాని బౌలింగ్‌లో బ్రియాన్ బెన్నెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మొమినుల్ హక్ కూడా త్వరగా ఔటవడంతో బంగ్లాదేశ్ 48/3తో కష్టాల్లో పడింది. అనంతరం ముష్ఫికుర్ రహీమ్ (34), కెప్టెన్ నజ్ముల్ హొసైన్ షాంటో (30) నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించి పోరాడే ప్రయత్నం చేశారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 185 పరుగుల వద్ద ముగిసింది.
ఈ మ్యాచ్‌లో అద్భుతమైన శతకం సాధించిన ఇన్నోసెంట్ కాయా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... 'ఈ విజయం మా కఠోర శ్రమకు దక్కిన ఫలితం. ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. పిచ్ బ్యాటింగ్‌కు సులభంగా లేకపోయినా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగలిగాను' అని కాయా చెప్పాడు.
బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొసైన్ షాంటో ఓటమిపై స్పందిస్తూ.. 'తొలి ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. అదే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించింది. మా బౌలర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఇటీవల పాకిస్థాన్‌పై సిరీస్ గెలిచి మంచి ఆత్మవిశ్వాసంతో వచ్చాం. కానీ ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా మా ఆటను మార్చుకోలేకపోయాం' అని అంగీకరించాడు.




