Ichchapuram: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద 16 కేజీల గంజాయి స్వాధీనం!
Ichchapuram: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద రూ.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ముకుందరావు తెలిపారు.
Ichchapuram: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద 16 కేజీల గంజాయి స్వాధీనం!
Ichchapuram: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో పట్టణ ఎస్.ఐ ఎం. ముకుందరావు తన సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం ఇచ్చాపురం రైల్వేస్టేషన్ వద్ద నిఘా పెట్టగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిని విచారించగా, బీహార్ రాష్ట్రం నలందా జిల్లాకు చెందిన సునీల్ కుమార్ అలియాస్ మోహిత్ జైస్వాల్ (19), ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పత్తాపూర్‌కు చెందిన సూర్యనారాయణ గౌడ అలియాస్ సిల్లు గౌడ (31)గా గుర్తించారు.
పోలీసుల విచారణలో నిందితుడు సునీల్ కుమార్ తన ఖర్చుల నిమిత్తం సులభంగా డబ్బు సంపాదించేందుకు అమిత్ అలియాస్ నకుల్ కుమార్ అనే వ్యక్తితో చేతులు కలిపినట్లు తేలింది. ఒడిశా నుంచి గంజాయి తెచ్చేందుకు సహకరిస్తే రూ.10,000 ఇస్తానని అమిత్ ఆశ చూపడంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడ్డాడు. వీరిద్దరూ కలిసి ఒడిశాలోని లక్ష్మీకాంత్ గౌడ వద్ద 16 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అయితే, బరంపురం రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల తనిఖీలు ముమ్మరంగా ఉండటంతో, నిందితులు రూట్ మార్చి సూర్యనారాయణ గౌడ బైక్‌పై సూట్‌కేస్, బ్యాగులతో ఇచ్చాపురం రైల్వే స్టేషన్‌కు రైలు ఎక్కేందుకు చేరుకోగా పోలీసులు పట్టుకున్నారు.వారి వద్ద నుండి సుమారు 16 కేజీల గంజాయి, రెండు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, మరియు రవాణాకు ఉపయోగించిన హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్.ఐ ముకుందరావు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
ఎస్పీ హెచ్చరిక – తల్లిదండ్రులకు సూచన:
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా, విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, చట్టపరంగా రౌడీషీట్లు కూడా తెరుస్తామని హెచ్చరించారు. గంజాయి సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లల నడవడిక, స్నేహాలపై ఓ కన్నేసి ఉంచాలని, మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును పాడుచేసుకోకుండా సరైన సమయంలో కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు.




