Kanchili: ప్రజా సంక్షేమం గాలికొదిలి...దోపిడీ పాలన సాగుతోంది ప్రభాకర్ ధ్వజం!

Kanchili: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోపిడీ పాలన సాగిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ ఆరోపించారు.

G.RAMBABU, SOMPET
Published on: 2 Aug 2026 5:15 PM IST
Kanchili
X

Kanchili: ప్రజా సంక్షేమం గాలికొదిలి...దోపిడీ పాలన సాగుతోంది ప్రభాకర్ ధ్వజం!

కంచిలి: కంచిలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి దోపిడీ విధానాలతో పాలన సాగిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు ప్రచారానికే పరిమితమవుతూ, అవినీతి, కమిషన్ల రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.

కంచిలి మండలం దాకరాపల్లి గ్రామంలో స్మశాన వాటిక కోసం సీపీఐ ఆధ్వర్యంలో సాగిన పోరాటం ఫలితంగా ప్రభుత్వం కేటాయించిన ఎనిమిది సెంట్ల స్థలంలో ఆదివారం స్మశాన వాటికను డేగ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనంతరం "దున్నేవాడికే భూమి" ఉద్యమం ద్వారా లక్షలాది నిరుపేదలకు భూములు అందించిన చరిత్ర సీపీఐకే దక్కిందని గుర్తు చేశారు. నేటికీ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు స్మశాన వాటిక కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నెలకొనడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

దాకరాపల్లి గ్రామంలో స్మశాన వాటిక ఏర్పాటుకు కూడా ప్రజలు పోరాటం చేయాల్సి రావడం బాధాకరమని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కనీస మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే అశోక్ ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ మేరకు చొరవ చూపారో ప్రజలే ఆలోచించాలని అన్నారు.

రాష్ట్రంలో మద్యం, ఇసుక తదితర రంగాల్లో భారీ కమిషన్ల వ్యవస్థ కొనసాగుతోందని, అధికార పార్టీ ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తోందని ఆరోపించారు. విద్యాశాఖలో డీఎస్సీ నియామకాల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు సక్రమంగా చేయలేకపోయారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై స్పందించకపోవడం పట్ల కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

ఈ నెల 6 నుంచి 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి, అనంతరం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు డేగ ప్రభాకర్ వెల్లడించారు.

దాకరాపల్లి స్మశాన వాటికలో సొంత వ్యయంతో బోరుబావి తవ్వించి నీటి ట్యాంకు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన స్థానిక వైసీపీ నాయకుడు గుమ్మడి రామదాసును ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శి లండ వెంకట్రావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. యుగంధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాలిన నారాయణస్వామి, పుక్కల్ల అరేలమ్మ, గస్య దీనబంధు, అయినింటి లోకనాథం, పిన్నింటి రామారావు, డొక్కరి దాలయ్యతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story