Srikakulam: బీసీలను మభ్యపెట్టేందుకే 34% రిజర్వేషన్లపై హడావుడి!

Srikakulam: సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా జీవో ఇచ్చి కూటమి ప్రభుత్వం బీసీలను మోసగిస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపాటు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 1 Oct 2026 3:40 PM IST
Srikakulam
X

Srikakulam: బీసీలను మభ్యపెట్టేందుకే 34% రిజర్వేషన్లపై హడావుడి!

Srikakulam: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మన దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఏంటంటే, వివిధ కేటగిరీల కింద ఉన్న రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతానికి మించకూడదన్నది ఆ బెంచ్ ఇచ్చిన తీర్పు. ఇది దేశంలో అత్యున్నత న్యాయస్థానం అమలులో ఉన్నటువంటి తీర్పు. దేశంలోని సామాన్య పౌరులకు కూడా తెలిసిన విషయం.

కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ విషయం తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ మళ్లీ ఒక జీవో ఇచ్చి, నేను అమలు చేస్తాను అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి?

ఈ జీవో ఇచ్చిన నాడే మేము చెప్పాం. ఇది రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి కొట్టేస్తారని చెప్పాం. ప్రభుత్వంలో ఎవరు సలహాలు ఇస్తున్నారు? పోనీ ఏమరపాటున ముఖ్యమంత్రి ఉన్నారనుకుంటే, టాప్ లెవెల్ బ్యూరోక్రాట్లు ఏం చేస్తున్నట్టు? సరిగ్గా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి గైడ్ చేయడం లేదా? అన్నది మేమంతా ఆశ్చర్యపోయాం.

ఆ కొద్ది రోజుల్లో విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా నేను ఇదే విషయం చెప్పాను. ప్రభుత్వం హడావుడిగా జీవో విడుదల చేసింది. ఆ జీవో సారాంశం ఏంటంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇద్దామని అంటున్నారు. అంటే, ఇది కేవలం మోసగించే చర్య. రేపు కోర్టు కొట్టేస్తుందని మేము అప్పుడే చెప్పాం.

ఒక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత అయిన ముఖ్యమంత్రి, అధికారులు చెప్పాల్సిన, దేశంలోని పౌరులందరికీ తెలిసిన ఒక విషయాన్ని ఉపయోగించి ప్రజలను ఎందుకు మభ్యపెట్టాలి? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం.

ఇలా చేయడం తప్పు కదా? తప్పు కాదంటే, నా ఉద్దేశంలో అమాయకులైన బీసీలను మోసగించడానికి ఒక ఆయుధంగానే మీరు దీన్ని చూస్తున్నారు తప్ప, రాజ్యాంగాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి ఇలా చేయకూడదు. నైతికతను మీరు ఎందుకు పాటించడం లేదు? అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం.

మీకు నిజంగా 34 శాతం ఇవ్వాలంటే ఇవ్వవచ్చు కదా. మీరు ఇప్పుడు ఇవ్వండి. మీకంటే ముందు ఐదు సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎలాంటి రిజర్వేషన్లు, రాజకీయ అవకాశాలు ఇచ్చారో చూడండి. ఈ రాష్ట్రంలో 13 మేయర్ పదవుల్లో 9 పదవులను బీసీలకు ఇచ్చారు అంటే 69 శాతం. అలాగే 13 జిల్లా పరిషత్‌లలో 6 బీసీలకు ఇవ్వడం జరిగింది అంటే 46 శాతం. ఇవేమీ కేవలం జీవోలు ఇచ్చి చేసినవి కాదు.

మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల పట్ల ప్రేమ ఉందా? కోర్టు కొట్టేస్తుందని తెలిసి జీవో ఇష్యూ చేసి హడావుడి చేయడం ద్వారా మీకు బీసీలపై ప్రేమ ఉందని అనుకోవాలా? ఇప్పుడు చేయండి. మీకు అవకాశం వచ్చింది. ఎన్నికలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారితో సమానంగా బీసీలకు అవకాశాలు ఇచ్చామని అనిపించుకోగలరేమో చూద్దాం.

ఇలా చూస్తే 11 రాజ్యసభ సీట్లలో నాలుగు బీసీలకు ఇవ్వడం జరిగింది అంటే 36 శాతం. 25 లోక్‌సభ స్థానాలకు గాను 11 బీసీలకు ఇవ్వడం జరిగింది అంటే 44 శాతం. ఎమ్మెల్సీలు 58 ఉంటే 28 మంది బీసీలకు ఇవ్వడం జరిగింది అంటే 48 శాతం. అలాగే ఎంపీపీలు 68 శాతం, మున్సిపల్ చైర్‌పర్సన్ పదవులు 53 శాతం, ఎంపీటీసీలు 41 శాతం, జడ్పీటీసీలు 36 శాతం.

ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మాటలు కాకుండా, తన పార్టీ ద్వారా రాజకీయ అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టింది.

మరి మీరు ఎందుకు మోసగించాలని చూస్తున్నారు? 34 శాతం అంటూ జీవో ఇవ్వడం, అన్ని చోట్ల పాలాభిషేకాలు చేయించుకోవాలని ఆదేశించడం ఎందుకు? అది కొట్టేస్తారని విషయం రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి తెలుసు. ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయాన్ని కూడా ఎందుకు బీసీలను మభ్యపెట్టడానికి ఉపయోగిస్తున్నారు?

ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా. మేము ఇచ్చినట్టు మీరు 69 శాతం వరకు అవకాశం ఇవ్వగలరా? మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఒక ప్రభుత్వ ఆర్డర్ ద్వారా మీరు చూపించలేరు. అది మోసగించడం. కానీ పార్టీ ద్వారా సీట్లు ఇచ్చి మీరు చేయగలరు. చేయండి. ఎన్నికలైన తర్వాత మిమ్మల్ని ప్రశ్నిస్తాం.

నేను ఛాంపియన్ బీసీల పార్టీ టీడీపీ అని ఊరికే మీరు చెబుతున్నారని అంటున్నాను. నేను కాదు అని కరాఖండిగా చెబుతాను. స్టాటిస్టిక్స్‌తో చెబుతాను. మీది బీసీల పార్టీ కాదు. బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేస్తారు. ఏ ముఖ్యమైన కార్యక్రమంలో కూడా బీసీలకు అవకాశం ఇవ్వరు. రాజ్యాంగ పదవులు అనేకం ఉన్నాయి. మీరు ఇవ్వగలరా? వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వరు.

మీరు ఎంపిక చేసిన ఫార్వర్డ్ క్లాస్‌కు చెందినవారు అసమర్థులని నేను అనడం లేదు. కానీ బీసీలలో కూడా సమర్థులైన వారు ఉన్నారు. కానీ బీసీలందరూ అసమర్థులనే భావనతో మీరు వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వం చేయాల్సిన నియామకాల విషయానికి వచ్చినప్పుడు జ్యుడీషియరీలో ఒక్క బీసీని కూడా మీరు రికమెండ్ చేయలేదు. యూనివర్సిటీల విషయానికి వచ్చేసరికి వైస్‌చాన్స్‌లర్లుగా బీసీలకు అవకాశం ఇవ్వలేదు. గవర్నర్ పదవుల విషయానికి వచ్చేసరికి ఎలాగో మాలాంటి బీసీల వైపు మీరు కన్నెత్తి కూడా చూడరు.

ఎట్లా మీరు బీసీల పార్టీ అని క్లైమ్ చేసుకుంటారు?

బీసీలలో కూడా ఈనాడు చదువుకున్న వారి సంఖ్య పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. ఇకముందు ఇలాంటి ఆగడాలు చేయకుండా, ఇచ్చామని చెప్పి మనసులో లేకుండా మభ్యపెట్టాలని అనుకునే విషయాలను కూడా మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. ఇకముందు ఇలాంటి ఆగడాలను బీసీ ప్రజలు హర్షించరు. మానుకోవాలని కోరుతున్నాను.

దేశంలో ఉన్న ఎపెక్స్ కోర్టు తీర్పును ఎవరైనా ఆమోదించి తీరాల్సిందే. మేము దాన్ని ముందే చెప్పాం. ఇప్పుడు ఇచ్చిన తీర్పును కూడా గౌరవించి తీరాల్సిందే. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. కానీ గతంలో మేము బీసీలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఇస్తాం. మా లాగా బీసీలను రాష్ట్రంలో ప్రోత్సహించిన పార్టీ లేదు.

మీది కాదని మేము చెబుతున్నాం. మీరు క్లైమ్ చేసుకోవాలంటే కాదు. ఇది రుజువు చేసుకోవాలంటే మీకు ధైర్యం కావాలి, ఆత్మవిశ్వాసం కావాలి. బీసీలలో కూడా సమర్థులైన వారు ఉన్నారనే విషయాన్ని అంగీకరించాలి. అంగీకరించరు, చేయలేరు. రాష్ట్ర మంత్రి పదవుల్లో మేమిచ్చినన్ని మీరు ఎప్పుడైనా ఇచ్చారా? 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలకు చెందిన మంత్రులు ఉన్నారు అంటే 40 శాతం. మాతో మీరు పోటీ పడలేరు.

నిజమైన బీసీలకు రాజ్యాధికారం కట్టబెట్టి, ఈ సమాజంలో ఉన్న వ్యత్యాసాలను, సామాజిక అంతరాలను తగ్గించడానికి నిజమైన కృషి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేశారని మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాను. బీసీ మిత్రులందరూ ఈ విషయాన్ని తెలుసుకుని, తగిన విధంగా స్పందించాలని, అందరికీ చెబుతూ చైతన్యపరచాలని తెలియజేస్తున్నాను అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.