Kanchili: గణిత గురువుకు 'గణితావధాన రత్న' గౌరవం
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాంలో గణిత అవధాని మడ్డు తిరుపతిరావుకు 'గణితావధాన రత్న' బిరుదు ప్రదానం.
Kanchili: గణిత గురువుకు 'గణితావధాన రత్న' గౌరవం
Kanchili: గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందిస్తూ, గణిత భయాన్ని తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 283 ఉచిత గణిత అవధానాలు నిర్వహించిన గణిత అవధాని మడ్డు తిరుపతిరావు మాస్టర్‌కు గణితావధాన రత్న బిరుదుతో ఘన సత్కారం చేశారు. కంచిలి మండలం బూరగాం ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన కింజరాపు ఎర్రంనాయుడు కళావేదిక ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఇచ్చాపురం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ బాబు చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ బాబు మాట్లాడుతూ, గణితాన్ని భయంగా కాక జ్ఞాన సాధనంగా మార్చి విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీసిన గురువుగా మడ్డు తిరుపతిరావు ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అసాధారణ మేధస్సును తీర్చిదిద్దగల సామర్థ్యం ఉన్న ఉపాధ్యాయులు సమాజానికి ఆస్తులని కొనియాడారు.
సభలో మడ్డు తిరుపతిరావు మాస్టర్ శిష్యురాలు, బాల మేధావి ఉలాల నందు నిర్వహించిన మేథా సంపత్తి ప్రదర్శన, గణిత అవధానం సభికులను అబ్బుర పరిచింది. ఎమ్మెల్యే అశోక్ బాబు వివిధ రాష్ట్రాల పేర్లు చెప్పగా వాటి రాజధానులు, దేశాల పేర్లు చెప్పగా వాటి రాజధానులు, 2026 క్యాలెండర్లో తేదీలు చెప్పగా వారాల పేర్లు, మనోసంకలనం వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు చెప్పి నందు ప్రతిభ చాటింది. బాలిక ప్రదర్శనకు సభికుల నుంచి విశేష అభినందనలు లభించాయి.
జనసేన ఇన్చార్జి దాసరి రాజు మాట్లాడుతూ, గణిత అవధానం ద్వారా విద్యార్థుల్లో మేధో వికాసం పెంపొందించడంలో మడ్డు తిరుపతిరావు కృషి అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఇలాంటి ప్రతిభ వెలుగులోకి రావడం గర్వకారణమని పేర్కొన్నారు.
గణితంలో వినూత్న ప్రయోగాలు, అవధానాల ద్వారా వందలాది మంది విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచిన గురువుగా మడ్డు తిరుపతిరావు సేవలను పలువురు కొనియాడారు. బాల మేధావులను తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమలరావు, ఎంఈవో సప్పటి శివరామ్ ప్రసాద్, మద్దిల నాగేశ్వరరావు, బంగారు కురయ్య, పైల పురుషోత్తం, బద్రి నాగేశ్వరరావు, బొడ్డు అప్పారావు, మద్దిల చంద్రశేఖర్, బద్రి శ్రీను, డొక్కరి ఈశ్వరరావు, పీవీ రమణ, బొట్ట గంగారావు, తలగాన వాసు, చల్ల శాంతారావు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




