Ichchapuram: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

Ichchapuram: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఇచ్ఛాపురం జ్ఞాన భారతి విద్యార్థులు రజత, కాంస్య పతకాలు సాధించి పాఠశాల పేరును నిలబెట్టారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 8 Oct 2026 5:59 PM IST
Ichchapuram
X

Ichchapuram: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ఇచ్ఛాపురం: విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్థానిక జ్ఞాన భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పతకాల పంట పండించారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థి కె. ప్రవీణ్ 5 కిలోమీటర్ల నడక పందెంలో ద్వితీయ స్థానం సాధించి రజత పతకం (వెండి) దక్కించుకోగా, డెకథ్లాన్ క్రీడాంశంలో మహమ్మద్ అమ్రాన్ అక్మల్ రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే షాట్‌పుట్ విభాగంలో వి. అఖిల్ తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి పాఠశాల పేరును నిలబెట్టిన ఈ విద్యార్థులను గురువారం పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి, సీఈవో జోహార్ ఖాన్ మాట్లాడుతూ... తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన శిక్షణ అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని అద్భుత ఫలితాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా సీబీఎస్‌ఈ జాతీయ స్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు రాణిస్తూ తోటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

ఈ అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఐ.బి. పండా, ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, ప్రధానోపాధ్యాయురాలు రషీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్ బెహరా, అదనపు పరిపాలన అధికారిణి సయ్యదా సుల్తానా, ట్రాన్స్‌పోర్ట్ మేనేజర్ అలీమ్ ఖాన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram