Ichchapuram: ఇచ్చాపురం మున్సిపల్ పీఠం మాదే: బెందాళం అశోక్

Ichchapuram: ఇచ్చాపురం మున్సిపల్ చైర్మన్ కూటమి అభ్యర్థిగా ఆశి లీలారాణి ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 18 Oct 2026 6:52 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురం మున్సిపల్ పీఠం మాదే: బెందాళం అశోక్

ఇచ్చాపురం: ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో స్థానికంగా రాజకీయ సందడి తారాస్థాయికి చేరింది. మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవడమే లక్ష్యంగా కూటమి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చైర్మన్ పదవికి కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా ఆశి లీలారాణి నామినేషన్ దాఖలు చేశారు.

ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, భారీ సంఖ్యలో కార్యకర్తలతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామినేషన్ కేంద్రానికి చేరుకుని ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇచ్చాపురం మున్సిపాలిటీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఆరు ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే గెలిచామని, అయితే ఈసారి సమీకరణాలు పూర్తిగా మారాయని పేర్కొన్నారు. "ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మున్సిపల్ పీఠాన్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రజల మద్దతు మాకే ఉంది. కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతుంది" అని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే టికెట్ల కేటాయింపుపై స్పందిస్తూ.. టికెట్ ఆశించిన వారికి అవకాశం దక్కనప్పుడు కొంత అసంతృప్తి, అలకలు రావడం రాజకీయాల్లో సహజమని అన్నారు. అలాంటి చిన్నపాటి విభేదాలను కూర్చొని పరిష్కరించుకుంటామని, అంతర్గత చర్చలు ఇప్పటికే సాగుతున్నాయని చెప్పారు. సీటు రాలేదన్న కారణంతో పార్టీని ఎవరూ వీడే ప్రసక్తే లేదని, అందరూ సమష్టిగా కూటమి గెలుపు కోసం పనిచేస్తారని స్పష్టం చేశారు.

లీలారాణి నామినేషన్‌తో ఇచ్చాపురం ఎన్నికల బరి మరింత ఆసక్తికరంగా మారింది. పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి పట్టుదలతో ఉండటంతో, రాబోయే రోజుల్లో పోరు మరింత హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram