Ichchapuram: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ పర్యటన

Ichchapuram: ఇచ్ఛాపురంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌బాబు పర్యటన. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచన.

G.RAMBABU, SOMPET
Published on: 23 Sept 2026 9:09 PM IST
Ichchapuram
X

Ichchapuram: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ పర్యటన

ఇచ్చాపురం: కవిటి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్‌బాబు బుధవారం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

కవిటి మండలంలోని చిన్నకర్రివానిపాలెం, పెద్దకర్రివానిపాలెం, కవిటి తదితర ప్రాంతాల్లో పర్యటించిన అశోక్‌బాబు రైతులను కలిసి వరి నాట్లు, వర్షాల కారణంగా పంటలకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పంటలకు నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు చేశారు.

అనంతరం పీకేపాలెంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ప్రత్యక్షంగా సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. మత్స్యకారులతో మాట్లాడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సముద్రంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా అశోక్‌బాబు మాట్లాడుతూ బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తుఫాను పరిస్థితులపై అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET