Kanchili: ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు కుమార్తెను మార్చిన కంచిలి వైద్యుడు
Kanchili: ప్రభుత్వ బడి వైపు ప్రముఖ డాక్టర్ నర్తు కృష్ణంరాజు అడుగులు.. పురుషోత్తపురం ప్రభుత్వ పాఠశాలలో కుమార్తె జెస్సికారాజ్ అడ్మిషన్.
Kanchili: ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలకు కుమార్తెను మార్చిన కంచిలి వైద్యుడు
కంచిలి: పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు నర్తు కృష్ణంరాజు తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న నాణ్యమైన బోధనా పద్ధతులు, వినూత్న కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. గతంలో ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి వరకు చదివిన తన కుమార్తె నర్తు జెస్సికారాజ్‌ను కంచిలి మండలం పురుషోత్తపురం ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతిలో చేర్పించారు.
శుక్రవారం నిర్వహించిన అడ్మిషన్ డ్రైవ్ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి సప్పటి శివరాంప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సింహభట్ల శారద అడ్మిషన్ పత్రాన్ని డాక్టర్ కృష్ణంరాజుకు అందజేశారు. ప్రముఖుల పిల్లలు ప్రభుత్వ బడుల్లో చేరడం వల్ల ఇతర తల్లిదండ్రుల్లోనూ నమ్మకం పెరుగుతుందని ఎంఈఓ శివరాం ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
అనంతరం డాక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రభుత్వ బడుల్లో ఇప్పుడు మౌలిక వసతులు, డిజిటల్ బోధన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా ప్రమాణాలు ఎంతగానో మెరుగయ్యాయని కొనియాడారు. తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాలల వైపు చూడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సప్పటి శివరాం ప్రసాద్, ఉపాధ్యాయులు నల్లాన రవి, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శమళ్ల వెంకటరావు, సీఆర్ఎంటీ వజ్జ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




