Kanchili: కంచిలి బూరగాం పాఠశాలలో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి

Kanchili: కంచిలి మండలం బూరగాం ఉన్నత పాఠశాలలో ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి. నివాళులర్పించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు.

G.RAMBABU, SOMPET
Published on: 27 July 2026 7:07 PM IST
Kanchili
X

Kanchili: కంచిలి బూరగాం పాఠశాలలో ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి

కంచిలి: భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కంచిలి మండలంలోని బూరగాం ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం చిత్రపటానికి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సంయుక్తంగా పుష్పాంజలి ఘటించి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు కాంతారావు, సోమేశ్వరరావు మాట్లాడుతూ, డాక్టర్ అవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో సాధారణ కుటుంబంలో జన్మించి, తన ప్రతిభతో దేశ అత్యున్నత పదవిని అలంకరించిన మహనీయుడిగా నిలిచారని పేర్కొన్నారు.

మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ)లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ అగ్ని, పృథ్వి వంటి క్షిపణుల అభివృద్ధికి విశేష కృషి చేశారని వివరించారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో ఆయన పోషించిన పాత్ర దేశ రక్షణ రంగ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారతరత్న పురస్కారం అందుకున్నారని తెలిపారు.

పదో తరగతి హిందీ పాఠ్యాంశాన్ని ఆధారంగా తీసుకుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ, 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా సేవలందించిన కలాం విద్యార్థులతో అత్యంత సన్నిహితంగా మెలిగినందున ఆయనను ప్రజల రాష్ట్రపతిగా దేశం గౌరవించిందన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి, శ్రమ, విజ్ఞాన సాధన, ఉన్నత ఆశయాలతో జీవితాన్ని మలుచుకోవాలని ఆయన జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలాం చెప్పిన మన జననం సాధారణం కావచ్చు... కానీ మన మరణం చరిత్ర సృష్టించేలా ఉండాలి అనే సందేశాన్ని విద్యార్థులకు గుర్తు చేస్తూ, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఉపాధ్యాయులు సూచించారు.

అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి "కలాం జీ కో సలాం" అంటూ నివాళులర్పించారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రోజారమణి, చంద్రశేఖర్, చలపతి, నిరంజన్, పుణ్యావతి, విజయలక్ష్మి, కిరణ్, కుశరాజు, ఎం.వి. రమణమూర్తి, కాంతారావు, సోమేశ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story