Kotabommali: కోటబొమ్మాళిలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
Kotabommali: కోటబొమ్మాళిలో రైతులకు భూ హక్కు పత్రాలు అందజేసిన మంత్రి అచ్చెన్నాయుడు. దశాబ్దాల భూ సమస్యలకు చంద్రబాబు నాయకత్వంలో శాశ్వత పరిష్కారం.
Kotabommali: కోటబొమ్మాళిలో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి: భూములను సాగు చేసుకుంటున్నా హక్కుపత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. యాభై ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.
కోటబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా భూ హక్కుల పరిరక్షణ, పేదల సంక్షేమం, సాగు–తాగునీటి పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడారు.
భూములు రైతుల ఆధీనంలో ఉన్నప్పటికీ రికార్డుల్లో అగ్రహారం, దేవాదాయ తదితర వర్గీకరణలతో నమోదై ఉండటం, యాజమాన్య వివరాల్లో సమస్యల కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇటువంటి గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను పరిష్కరించి అర్హులైన రైతులకు హక్కుపత్రాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
అసలైన భూ యజమానుల హక్కులకు భరోసా కల్పించేలా రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు అందిస్తున్నామని వివరించారు. ఒకరోజు ఆలస్యమైనా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదయ్యే పరిస్థితి ఉండకూడదని రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
ఇటీవల నందిగాం మండలంలో సుమారు 150 మందికి భూ హక్కులు కల్పించి పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేశామని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. ప్రస్తుత కార్యక్రమానికి సంబంధించిన సుమారు నాలుగు వేల మంది రైతుల భూ సమస్యల్లో 98 శాతం పరిష్కరించినట్లు చెప్పారు.
మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. భూ సమస్యలు ఉన్నవారు వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, రైతులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా చూడాలని ఆదేశించారు.
మండలంలోని పట్టుపురం గ్రామంలో 1,301 మంది, విశ్వనాధపురంలో 749 మంది, ఎలమంచిలిలో 1,350 మంది, గంగరాంలో 459 మంది, నిమ్మాడలో 731 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు.




