Kurupam: నియోజకవర్గంలో 82 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు వలల పంపిణీ
Kurupam: కురుపాం నియోజకవర్గంలో 82 మంది మత్స్యకారులకు ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి ఐటీడీఏ నిధులతో 75% సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, వేట వలలను పంపిణీ చేశారు.
Kurupam: నియోజకవర్గంలో 82 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలు వలల పంపిణీ
కురూపం: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, వారి సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలను చేపడుతోందని కురుపాం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి అన్నారు.
ఆదివారం కురుపాం నియోజకవర్గ పరిధిలోని 82 మంది మత్స్యకారులకు ఐ.టి.డి.ఎ నిధులతో 75 శాతం సబ్సిడీపై మంజూరైన ద్విచక్ర వాహనాలను, చేపల వేట వలలను ఆమె ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కురుపాం నియోజకవర్గంలో 12 మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయని, వాటిలో 682 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు.
అర్హులైన ప్రతి మత్స్యకారుడికి ప్రభుత్వ ఫలాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజు నియోజకవర్గ పరిధిలో రూ. 28.97 లక్షల విలువ గల 25 ద్విచక్ర వాహనాలను ఐస్ బాక్సులతో, అలాగే రూ. 8.46 లక్షల విలువ గల 57 నాణ్యమైన చేపల వేట వలలను లబ్ధిదారులకు అందజేశామని వివరించారు.
దళారీల వ్యవస్థకు చెక్ – త్వరితగతిన రవాణా
గతంలో మత్స్యకారులు బుట్టలలో చేపలు పెట్టుకుని నడుచుకుంటూ లేదా సైకిళ్లపై వెళ్లడం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయేవారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పుడు ఐస్ బాక్స్ అమర్చిన ద్విచక్ర వాహనాల ద్వారా సముద్ర తీరం లేదా చెరువుల నుండి నేరుగా గ్రామీణ, పట్టణ మార్కెట్లకు చాలా తక్కువ సమయంలో చేపలను రవాణా చేయవచ్చన్నారు. ఎండ వేడికి చేపలు పాడైపోకుండా, తాజా స్థితిలోనే వీధులు, గ్రామాల్లో తిరుగుతూ నేరుగా వినియోగదారులకే అమ్ముకోవచ్చని సూచించారు.
దీనివల్ల మధ్యవర్తులు లేదా దళారీల ప్రమేయం లేకుండా పూర్తి లాభం మత్స్యకారులకే దక్కుతుందని, ఫలితంగా మత్స్యకార కుటుంబాల రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. వినియోగదారులకు సైతం అధిక పోషకాలతో కూడిన తాజా చేపలు లభిస్తాయన్నారు. వాహనంతో పాటు అందించిన నాణ్యమైన వలలు వేట సామర్థ్యాన్ని పెంచుతాయని, అదనపు సామగ్రిని వాహనాలపై సులభంగా సర్దుకుని వెళ్లేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను అర్హులైన మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకుని తమ జీవనోపాధిని మరింత మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి టి. సంతోష్ కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారిని యు. చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖీదారు ఎస్. దుర్గా రావు, వివిధ మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు మరియు లబ్ధిదారులు ఉన్నారు.




