Pathapatnam: కాశీబుగ్గ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి.. వైఎస్సార్‌సీపీ!

Pathapatnam: కాశీబుగ్గ రోడ్డు ప్రమాదంలో దానయ్య మృతిపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వైఎస్సార్‌సీపీ నేతలపై మండిపడ్డారు. పారదర్శక విచారణకు డిమాండ్ చేశారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 13 July 2026 11:42 PM IST
Pathapatnam
X

Pathapatnam: కాశీబుగ్గ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలి.. వైఎస్సార్‌సీపీ!

పాతపట్నం: నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన అత్యంత విషాదకరమని, ఒక అమాయకుడు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా నిజాలను దాచిపెట్టే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.

ఈ ఘటనలో బడుగు, బలహీన వర్గానికి చెందిన దానయ్య ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, బాధిత కుటుంబానికి న్యాయం జరగడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఎవరైనా సరే చట్టం ముందు అందరూ సమానమేనని, మాజీ మంత్రి కుటుంబ సభ్యుడైనా, సాధారణ పౌరుడైనా ఒకే న్యాయ ప్రమాణాలు అమలుకావాలని స్పష్టం చేశారు.

ప్రమాదం జరిగిన తర్వాత నిజాలను దాచిపెట్టడం, దర్యాప్తును తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాలను ప్రభావితం చేయడం వంటి ఆరోపణలు నిజమైతే అవి క్షమించరాని నేరాలని ఎమ్మెల్యే అన్నారు. కేసును సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, శాస్త్రీయ సాక్ష్యాల ఆధారంగా పారదర్శకంగా విచారించి, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని కోరారు.

ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులు కూడా చట్టానికి అతీతులు కారనే సందేశం ఈ కేసు ద్వారా సమాజానికి వెళ్లాలని అన్నారు.ఈ ప్రభుత్వం వ్యక్తులను కాదు, ఆధారాలను చూస్తుందని, హోదాలను కాదు, చట్టాన్ని అమలు చేస్తుందని పేర్కొంటూ, దర్యాప్తును ప్రభావితం చేసిన వారు ఎవరైనా వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలియజేశారు.త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో మండల నాయకులు పాల్గొన్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story