Parvathipuram: పీఎంశ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలి
Parvathipuram: భారత ప్రభుత్వ పీఎంశ్రీ (PM-SHRI) పథకం కింద పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంపికైన 20 ఆదర్శ పాఠశాలల ప్రగతి, మౌలిక వసతులు మరియు పీఎం పోషణ్
Parvathipuram: పీఎంశ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలి
పార్వతీపురం: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా పాఠశాలల్లో కావలసిన అదనపు గదులు, త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుద్దీకరణ వంటి మౌలిక వసతులతో పాటు డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ల్యాబ్ సామాగ్రి, క్రీడా సామాగ్రి తదితర వివరాలను పాఠశాలల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక రూపంలో అందజేయాలన్నారు.
పీఎంశ్రీ పాఠశాలల ప్రగతి మరియు పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజన పథకం) అమలుతీరుపై బుధవారం విద్యా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేసి వాటిని ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడం పీఎంశ్రీ పథకం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికైన 20 పాఠశాలలను ఆదర్శ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల పురోగతిని శాఖాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
ప్రతి పాఠశాలలో ర్యాంపులు, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలు కలిగిన మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, వంటశాలల నిర్వహణతో పాటు ‘న్యూట్రి గార్డెన్ల’ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
విద్యార్థుల రోజువారీ హాజరు, భోజన వినియోగం మరియు ఐఎంఎంఎస్ యాప్‌లో నమోదవుతున్న వివరాలను అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ప్రధాన లక్ష్యం ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి అభివృద్ధి పనిలోనూ నాణ్యత, పారదర్శకత, సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమం కోసం అధికారులు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు, సంబంధిత అధికారులు, సమగ్ర శిక్షా సిబ్బంది, వివిధ పాఠశాలల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




