Sompeta: బోన్‌మ్యారో వ్యాధితో పోరాడుతున్న బాధితుడికి సోంపేట దాతల చేయూత!
Sompeta: కంచిలి మండలానికి చెందిన దూపాన మాధవరావు వైద్య చికిత్స కోసం సోంపేటకు చెందిన 'మేమున్నాం' సేవా సంస్థ రూ.57,500 ఆర్థిక సహాయం అందజేసింది.
Sompeta: బోన్‌మ్యారో వ్యాధితో పోరాడుతున్న బాధితుడికి సోంపేట దాతల చేయూత!
సోంపేట: కంచిలి అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన దూపాన మాధవరావుకు సోంపేటకు చెందిన మేమున్నాం సేవా సంస్థ సభ్యులు ఆర్థిక చేయూత అందించారు. మాధవరావు వైద్య ఖర్చుల కోసం రూ.57,500 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
57 ఏళ్ల మాధవరావు కొంతకాలం విదేశాల్లో పనిచేసి అనారోగ్య కారణాలతో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. అనంతరం ఆరోగ్యం క్షీణించడంతో పాటు ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గడంతో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. వైద్య పరీక్షల్లో బోన్‌మ్యారో సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. గత ఐదు నెలలుగా వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు.
చికిత్స కోసం ఇప్పటికే సుమారు రూ.9 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరింత మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం అవసరమైన పరిస్థితిలో మాధవరావు కుటుంబం దాతల సాయం కోసం ఎదురుచూస్తోంది. కుటుంబ సభ్యులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండటంతో వైద్య ఖర్చులు భారంగా మారాయి.
మాధవరావు పరిస్థితిని తెలుసుకున్న మేమున్నాం సేవా సంస్థ 1987–88 పదో తరగతి బ్యాచ్ సభ్యులు స్పందించి తమ వంతు సహాయంగా రూ.57,500 అందించారు. మాధవరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన చికిత్స కొనసాగించేందుకు దాతలు కూడా తమకు తోచిన సహాయం అందించాలని కోరారు.
కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు తడక మాధవరావు, వాసు పాణిగ్రాహి, కప్ప గోపినాథ్, పసుపురెడ్డి రాము, బరాటం సతీష్, నాగరాజు, బల్ల జానకీరావు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు మాస్టర్, సానా మధు, శంకర్, విజయశంకర్, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.




