Srikakulam: సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి!
Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఏర్పాట్లను పరిశీలించి, సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు.
Srikakulam: సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి!
Srikakulam: కొత్తమ్మతల్లి అమ్మవారి 101వ వార్షిక జాతర మహోత్సవాలకు వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ముందుగా మంత్రి శ్రీ కొత్తమ్మతల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు మంత్రికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో జాతర మహోత్సవాలకు సంబంధించిన గొడపత్రికను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లపై ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.
జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
క్యూలైన్లు ఏర్పాటు చేసినప్పటికీ సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూలైన్ల వద్ద అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
కోటబొమ్మాళి,సంతబొమ్మాళి ప్రధాన రహదారిపై విద్యుత్ అలంకరణల కోసం చేపడుతున్న పనులను మంత్రి పరిశీలించారు. రాజగోపురం సమీపం నుంచి ప్రధాన రహదారి మీదుగా భక్తులు సులభంగా ఆలయానికి చేరుకునేలా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని సూచించారు.
జాతర సందర్భంగా ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో పాటు, పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని మంత్రి ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
రెవెన్యూ, పోలీస్, విద్యుత్, దేవాదాయ ధర్మాదాయ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, జాతర మహోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా శాఖలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.




