Srikakulam: జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి!
Srikakulam: టెక్కలిలో పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలుంటాయని, నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Srikakulam: జిల్లాలో అధికారులతో సమీక్ష నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి!
Srikakulam: టెక్కలి పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు.
టెక్కలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పట్టణ పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, వర్షపు నీటి నిల్వలు, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అధికారులతో వివరంగా చర్చించారు.
పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. పారిశుధ్య పనులు కేవలం అప్పటికప్పుడు చేపట్టే కార్యక్రమాలుగా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు.
నీరు నిలిచే 59 ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
టెక్కలి పరిసర ప్రాంతాల్లో నీరు నిలిచే 59 ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ ప్రాంతాల్లో వర్షాకాలంలో నీరు నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గుర్తించిన ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో విభజించి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అవసరమైన చోట శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
వర్షాలు ప్రారంభమైన తర్వాత హడావుడిగా చర్యలు తీసుకోవడం కాకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. నీటి నిల్వల కారణంగా ప్రజలకు ఇబ్బందులు, వ్యాధుల వ్యాప్తి తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.




