Kanchili: ఇచ్చాపురంలో అభివృద్ధి జోరు.. బూరగాంలో ఐదు రోడ్ల ప్రారంభం
Kanchili: కంచిలి మండలం బూరగాంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు పర్యటన. రూ.1.19 కోట్ల వ్యయంతో తారు రోడ్లు, సీసీ రోడ్లు మరియు కళావేదిక ప్రారంభం.
Kanchili: ఇచ్చాపురంలో అభివృద్ధి జోరు.. బూరగాంలో ఐదు రోడ్ల ప్రారంభం
Kanchili: ఇచ్చాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులే ప్రజలు మూడోసారి ఆశీర్వదించడానికి కారణమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ బాబు అన్నారు. కంచిలి మండలం బూరగాం పంచాయతీలో శుక్రవారం మొత్తం రూ.1.19 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రూ.67 లక్షల నాబార్డ్ నిధులతో నిర్మించిన బూరగాం–సోంపేట తారురోడ్డు, రూ.30 లక్షల పల్లె పండగ నిధులతో నిర్మించిన గొల్లవీధి సీసీ రోడ్డు, రూ.12 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎ నిధులతో నిర్మించిన భోళాలింగేశ్వర ఆలయ సిమెంట్ రోడ్డు, రూ.7 లక్షలతో కింజరాపు ఎర్రంనాయుడు కళావేదిక, రూ.3 లక్షలతో కప్పవీధి సిమెంట్ రోడ్డులను ప్రారంభించారు. ఒకేరోజు పలు పనుల ప్రారంభోత్సవాలు జరగడం గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొల్పింది.
ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో రహదారులు, మౌలిక వసతులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తారురోడ్లు, సిమెంట్ రోడ్లు, రక్షిత త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం రంగాల్లో ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టామని తెలిపారు. ఇదే అభివృద్ధి ప్రజలు మూడోసారి నమ్మకం ఉంచడానికి కారణమన్నారు.
గత ప్రభుత్వం హయాంలో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినా ప్రజలకు ఉపయోగపడే పనులు జరగలేదని విమర్శించారు. ప్రజలు విసిగి కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. బెంతోరియాల అంశంపై తన వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని, ప్రజా సమస్యలపై తాను ఎప్పుడూ బాధ్యతాయుతంగానే స్పందిస్తానని స్పష్టం చేశారు.
దాసరి రాజు మాట్లాడుతూ, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. బూరగాంలో ప్రారంభమైన పనులు ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటంతో పాటు గ్రామ ప్రగతికి బాటలు వేస్తాయని అన్నారు.
ఒకేరోజు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు జరగడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు అభివృద్ధి పనులు వేగవంతం కావడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ఎంపీడీవో వి. తిరుమలరావు, బంగారు కురయ్య, జగదీష్ పట్నాయక్, పిలక చినబాబు, బొడ్డు హరిబాబు, మాదిన ప్రదీప్,టివి రమణ, బూరగాం మాజీ సర్పంచ్ బొడ్డు రాజేశ్వరి అప్పారావు, సిహెచ్ శాంతారావు, బి. నగేష్, బి. గంగారావు, జనసేన నాయకులు ఎం. రామారావు, టి. వాసు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




