Pathapatnam: విద్యా ప్రమాణాల్లో సరికొత్త విప్లవానికి శ్రీకారం గోవిందరావు
Pathapatnam: 'షైనింగ్ స్టార్స్' విద్యా సదస్సులో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ. 20 వేల నగదు బహుమతి ప్రకటించారు.
Pathapatnam: విద్యా ప్రమాణాల్లో సరికొత్త విప్లవానికి శ్రీకారం గోవిందరావు
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఆనందమయ కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ పాఠశాలలను విద్యా ప్రమాణాల్లో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చేపడుతున్న "షైనింగ్ స్టార్స్" కార్యక్రమంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు (ఎంజీఆర్) పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విద్య, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత బోధన వంటి అంశాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం "షైనింగ్ స్టార్స్" కార్యక్రమం ద్వారా ఒక్కో ప్రతిభావంత విద్యార్థికి రూ.20,000/- వేల నగదు బహుమతి అందజేస్తోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
ఈ ప్రోత్సాహకం విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికితీసి, పోటీ ప్రపంచంలో రాణించేలా అవసరమైన వసతులు, ప్రోత్సాహకాలు, విద్యా సామగ్రిని ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంచి, నాణ్యమైన విద్యను ప్రతి విద్యార్థికి చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు.




