Tekkali: ఐతం కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె
Tekkali: ఐతం ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎం.ఎస్.కె. ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
Tekkali: ఐతం కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె
టెక్కలి: ఐతం ఇంజినీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఇంటర్ కాలేజ్ క్రీడా పోటీల విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి మాజీ క్రికెటర్, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎం.ఎస్.కె. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎం.ఎస్.కె. ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఐతం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు క్రీడలకు విశేష ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమన్నారు. విద్య, క్రీడలు, క్రమశిక్షణను సమన్వయం చేస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కళాశాల యాజమాన్యం చేస్తున్న కృషిని కొనియాడారు. ఆధునిక సౌకర్యాలు, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించే వాతావరణం ఐతం ప్రత్యేకత అని పేర్కొన్నారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వివిధ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులకు క్రీడా పోటీలు నిర్వహించడం ఐతం కళాశాల విశిష్టతకు నిదర్శనమన్నారు. ఇలాంటి విద్యాసంస్థలు గ్రామీణ ప్రాంత యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయని ప్రశంసించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని క్రీడలు అలవర్చుతాయన్నారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతరం శ్రమిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని చెప్పారు. ప్రతిభ ఒక్కటే విజయానికి సరిపోదని, క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదల ఎంతో అవసరమన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, సరైన శిక్షణ, అవకాశాలు కల్పిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని పేర్కొన్నారు. యువత క్రీడలను జీవితంలో భాగంగా చేసుకుని ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం క్రీడా పోటీల్లో విజేతలు, రన్నరప్‌లుగా నిలిచిన జట్లకు ఎం.ఎస్.కె. ప్రసాద్ నగదు బహుమతులు అందజేసి అభినందించారు.
విద్యార్థుల క్రికెట్ పోటీల్లో ఐతం విజేతగా, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రన్నరప్‌గా నిలిచాయి. వాలీబాల్‌లో రఘు ఇంజినీరింగ్ కళాశాల విజేతగా, ఐతం రన్నరప్‌గా, త్రోబాల్‌లో విగ్నాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–దువ్వాడ విజేతగా, ఎంవీజీఆర్–విజయనగరం రన్నరప్‌గా నిలిచాయి. మహిళల చెస్‌లో ఐతం విజేత, రన్నరప్ స్థానాలను దక్కించుకుంది. పురుషుల చెస్‌లో సంకేతిక విద్యా పరిషత్–విశాఖపట్నం విజేతగా, శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్–శ్రీకాకుళం రన్నరప్‌గా నిలిచాయి.
అధ్యాపకుల క్రికెట్ పోటీల్లో సెంచూరియన్ యూనివర్సిటీ–ఒడిశా విజేతగా, జీఎంఆర్‌ఐటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ రన్నరప్‌గా నిలిచాయి. వాలీబాల్, త్రోబాల్ పోటీల్లో జీఎంఆర్‌ఐటీ విజేతగా, ఐతం రన్నరప్‌గా నిలిచాయి.
కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె. సోమేశ్వరరావు, సెక్రటరీ ఎల్.ఎల్. నాయుడు, డైరెక్టర్ ప్రొఫెసర్ వి.వి. నాగేశ్వరరావు, మధుకుమార్, నాగశేషు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.ఎస్. శ్రీనివాసరావు, ఆర్ అండ్ డీ డీన్ డాక్టర్ డి. శ్రీరాములు, ప్లేస్‌మెంట్ డీన్ డాక్టర్ ఎం. సంతోష్‌కుమార్, పీడీలు లక్ష్మణ్ మూర్తి, మురళీ మోహన్, తేజేశ్వరి.తదితరులు పాల్గొన్నారు.




