Narsannapeta: నరసన్నపేటలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సుడిగాలి పర్యటన
Narsannapeta: నరసన్నపేటలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సీఎస్ఆర్ నిధులతో పాఠశాల ప్రారంభం, విశ్వకర్మ జయంతి వేడుకల్లో భాగస్వామ్యం.
Narsannapeta: నరసన్నపేటలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సుడిగాలి పర్యటన
నర్సన్నపేట: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం నరసన్నపేట నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
తొలుత కోమర్తి గ్రామానికి చేరుకున్న కేంద్ర మంత్రి.. గ్రామానికి చెందిన వైశ్యరాజు జ్యూవెలర్స్ యజమాని వైశ్యరాజు ఫల్గుణరావు ఆధ్వర్యంలో సంస్థ CSR నిధుల ద్వారా సుమారు రూ.20 లక్షలతో అభివృద్ధి చేసిన పాఠశాల వసతులను ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఆయన.. విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు CSR నిధులను వినియోగించి పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన వైశ్యరాజు కుటుంబ సభ్యులను అభినందించారు.
అనంతరం కంబకాయ గ్రామానికి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి, అవసరమైన చోట్ల అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం నరసన్నపేట పట్టణంలోని పెద్దపేటలో స్వర్ణకార సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. విశ్వకర్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించారు.
కంబకాయలో నిర్వహించిన సభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుని కూటమి ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తోందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ.. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూనే.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం ఉత్తరాంధ్రలో ఆశలు, అవకాశాలు మరింత పెరిగాయని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మరింత పెరగాలంటే కొత్త సంస్థలను, పెట్టుబడులను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు మెరుగైన కనెక్టివిటీతో పాటు ఆర్థిక, పారిశ్రామిక అవకాశాలు విస్తరించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహకారంతో మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే పోర్టును ప్రారంభించుకునే దిశగా పనులు కొనసాగుతున్నాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.




