Palasa: పలాస కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేయాలి
Palasa: పలాసలో కార్గో ఎయిర్‌పోర్ట్‌కు వ్యతిరేకంగా వామపక్షాల ధర్నా. పోలీసుల ఆంక్షలు, హౌస్ అరెస్టులను ధిక్కరించి నిరసన. పర్యావరణ పరిరక్షణకు డిమాండ్.
Palasa: పలాస కార్గో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేయాలి
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో ప్రతిపాదించిన కార్గో ఎయిర్ పోర్ట్ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలంటూ ప్రజాసంఘాలు పలాస ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ రైతు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.చలో ఆర్‌డీఓ ఆఫీస్ కార్యక్రమాన్ని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాలతో అణచివేయాలని చూడటాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
గ్రామాల నుండి ప్రజలు, రైతులు రాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నప్పటికీ, నిర్బంధాలను ఎదుర్కొని భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని నాయకులు తెలిపారు. ఆర్‌డీఓ కార్యాలయంలోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల ఆస్తులను ప్రకృతి సంపదను కొల్లగొట్టడమే మీరు చేసిన అభివృద్దా? అని కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజరాపు.రామ్మోహన్నాయుడుని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర.వెంకటరమణ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల.
మాధవరావు, సిపిఐ లిబరేషన్ నాయకులు మద్దిలి రామారావు ప్రశ్నించారు. ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ జూలై 15వ తేదీన చలో ఆర్ డి ఓ కార్యక్రమంకు వెళ్లకుండా పోలీసులు గ్రామాలలో ఆంక్షలు విధించారు. ముందు రోజు రాత్రి 11 గంటల నుండే వామపక్ష నాయకులు డి గోవిందరావు, చాపర వెంకటరమణ, వంకల మాధవరావు, యన్ గణపతి,మద్దిలి రామారావు,పి కుసుమ,ఇళ్ల వద్ద హౌస్ అరెస్టులు చేసేందుకు పోలీసులును కాపలా పెట్టారు.రైతులను రాకుండా అడ్డుకున్నారు.
దీనిని నిరసిస్తూ బిడిమి,రాంపురం, బేతాళపురం, గంగువాడ ఒంకులూరు 18 గ్రామాలలో గ్రామాలలో నిరసన ప్రదర్శనలు చేశారు. అనంతరం గ్రామాల నుండి ప్రతినిధులు ఆర్టీవో ఆఫీస్ కు చేరుకున్నారు.ఆర్ డి ఓ కార్యాలయం కు కూడా రానివ్వకుండా అడ్డుకుంటే నిరసన కారులు అడ్డుకున్న ప్రాంతానికి ప్రదర్శనగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులుకు వామపక్ష నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఒక సందర్భంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసులు ఒకవైపు ఆందోళనకారులు మరొకవైపు తోపులాట జరిగింది.నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్రమంత్రిగా ఉన్న మీరు జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటి? అని ప్రశ్నించారు. సుదీర్ఘ సముద్ర ప్రాంతంలో ఒక్క ఫిషింగ్ హార్బర్ మీరు నిర్మించారా? ఎన్నికల్లో జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని చేసిన వాగ్దానాన్ని అమలు చేశారా? వంశిధార లిఫ్ట్ ఇరిగేషన్ కు 200 కోట్లు కేటాయిస్తే రిజర్వాయర్ ద్వారా రెండు పంటలకు నీరు ఇవ్వవచ్చు.
ఒక్క పైసాఅయినా తెచ్చారా? 100 కోట్లు కేటాయిస్తే వంశధార - నాగావళి అనుసంధానం చెయ్యొచ్చు. మీరు ఎందుకు నిధులు కేటాయించలేదు? ఆఫ్ షోర్ రిజర్వాయర్ కు 20 సంవత్సరాల కాలంలో 19 కిలోమీటర్లు కాలువ గట్టు తవ్వలేకపోయారు.ఎందుకు నిధులు కేటాయించలేదు? 2019లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోడి రామ్మూర్తి స్టేడియం పగలగొట్టి 10 కోట్లు కూడా ఎందుకు కేటాయించలేకపోయారు? పాత్రుని వలస మల్టీపర్పస్ స్టేడియం కోసం 33 ఎకరాలు 2014లో సేకరించి నేటికీ నిధులు ఎందుకు కేటాయించలేదు,పనులు ఎందుకు ప్రారంభించలేదు? అని ప్రశ్నించారు.
వంశధార బ్యారేజ్ శిధిలావస్తకు చేరుకుందని ఆధునీకరణ కోసం 1500 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపినప్పటికీ ఒక్క సిల్లి గవ్వ కూడా కేటాయించుకోలేకపోయిన మీరు, జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు. భూములు ఇస్తే అభివృద్ధి జరుగుతుందని అబద్ధపు ప్రచారాలు చేసి మీ పక్కనే ఉన్న కాకరాపల్లిలో ముగ్గురు మనుషులను బలితీసుకొని, 2020 ఎకరాలు బలవంతంగా తీసుకొని ఎన్ని ఫ్యాక్టరీలు నిర్మించారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? అని ప్రశ్నించారు.ఆ ఫ్యాక్టరీలన్నీ ఆకాశంలో కట్టారా? అని ఎద్దేవా చేశారు.
ప్రకృతి వైపరీత్యాలు నుండి జిల్లాను కాపాడడంలోనూ, జిల్లాలో ఏకకాలంలో నాలుగు పంటలు పండే ఉద్దాన ప్రాంత భూమిని అక్కడ ఉండే ఉద్యానవనాల వల్ల వేలాది మంది రైతులు, కార్మికులు తరతరాలుగా జీవనం పొందుతున్నారని అన్నారు. ఉద్దానంలో విధ్వంసం సృష్టించడమే మీరు చేసిన అభివృద్దా?అని ప్రశ్నించారు.
జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రజల భూములు గుంజుకోవడం కాదని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి చివర భూముల వరకు నీరిస్తే ప్రజల ఆదాయం పెరుగుతుందని తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి వ్యవసాయ ఆధార పరిశ్రమలు వస్తాయని తద్వారా ప్రజలకు ఉపాధి దొరుకుతుందని జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.
కార్గో ఎయిర్పోర్ట్ ప్రాంతంలో భూములు జోలికొస్తే ప్రజా ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్గో వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు,కార్యదర్శి జోగి అప్పారావు, వామపక్ష నాయకులు పి నాగేశ్వరరావు, సి హెచ్ రవి, బి కుర్మారావు,,పోరాట కమిటీ సభ్యులు బత్తిని లక్షణరావు,గుంటు లోకనాధం, లండ రామస్వామి, పొట్టి ధర్మారావు, యన్ పరుశురాము,జోగి శ్రీదేవి, యల్ సంధ్య, గుంటు రామారావు,తదితరులు పాల్గొన్నారు.




