Pathapatnam: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం రెడ్డి శాంతి
Pathapatnam: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు అప్పగించడం భారీ స్కాం అని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా విమర్శించారు.
Pathapatnam: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భారీ స్కాం రెడ్డి శాంతి
పాతపట్నం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం ప్రజాధనాన్ని దోచుకునే భారీ స్కాంగా మారుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి తీవ్రంగా విమర్శించారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
జగనన్న ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని, వాటిలో ఐదు కాలేజీలను ప్రారంభించడంతో పాటు మరో మూడు కాలేజీలను తరగతుల నిర్వహణకు సిద్ధం చేశామని తెలిపారు. ఏడాదికి రూ.1,000 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తే మిగిలిన తొమ్మిది కాలేజీలను కూడా పూర్తి చేయవచ్చని, అలాంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపుతోందని ప్రశ్నించారు.
ఎకరాకు రూ.100కే భూముల లీజు.. ప్రజాధనంతో ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం!
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రతిపాదనలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని రెడ్డి శాంతి ఆరోపించారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎకరాకు కేవలం రూ.100 లీజుతో కేటాయించే ప్రతిపాదనలు, సగానికిపైగా మెడికల్ సీట్లను ప్రైవేటు సంస్థల ఆధీనంలో ఉంచే అవకాశం, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పేరుతో రూ.1,630 కోట్ల ప్రజాధనం కేటాయింపు వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. అంతేకాకుండా రెండేళ్లపాటు వైద్యులు, ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది జీతాలను కూడా ప్రభుత్వమే భరించే ప్రతిపాదన ఉందని, ఒక్కో కాలేజీకి నెలకు సుమారు రూ.5 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.120 కోట్ల భారం పడుతుందని వివరించారు.
భూములు ప్రభుత్వానివి, భవనాల నిర్మాణానికి వినియోగించిన నిధులు ప్రజలవే, నిర్వహణకు ఇచ్చే ఆర్థిక సాయం కూడా ప్రభుత్వానిదే అయినప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ఆమె నిలదీశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పేదలకు మెరుగైన వైద్యం
జగనన్న ప్రభుత్వం రూపొందించిన మెడికల్ కాలేజీల నమూనా ద్వారా పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్య అందించే అవకాశం ఉందని తెలిపారు. కన్వీనర్ కోటాలో సగం సీట్లు భర్తీ అవుతాయని, మిగిలిన సీట్లు కూడా ప్రైవేటు కళాశాలలతో పోలిస్తే తక్కువ ఫీజులకే అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కాలేజీల నిర్వహణకు అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణ కోసం గతంలోనే పటిష్టమైన నమూనాను రూపొందించి, బ్యాంకులతోనూ అనుసంధానం చేశామని వెల్లడించారు.
టీచింగ్ ఆస్పత్రులుగా పనిచేసే ఈ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల సేవలతో వైద్య వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పారు. జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీలు, విలేజ్ క్లినిక్లను అనుసంధానం చేస్తూ గ్రామీణ స్థాయి వరకు మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని వివరించారు.
ప్రభుత్వ వైద్యరంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ వైద్యరంగం బలహీనపడుతోందని రెడ్డి శాంతి విమర్శించారు. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే ఆరోగ్యశ్రీ పథకం అమలు నిర్వీర్యమవుతోందని, నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిల చెల్లింపుల్లో జాప్యం కారణంగా సేవలకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, వైద్యుల ఖాళీలు పెరగడం, నాడు–నేడు పనులు నిలిచిపోవడం, విలేజ్ క్లినిక్ల నిర్వహణ బలహీనపడటం, 108, 104 సేవల పరిస్థితి ఆందోళనకరంగా మారడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు.
గత ప్రభుత్వ హయాంలో జీరో వేకెన్సీ విధానం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల ఖాళీలను నాలుగు శాతానికి తగ్గించామని, ప్రస్తుతం ఆ విధానాన్ని పక్కనపెట్టడంతో మళ్లీ ఖాళీలు పెరుగుతున్నాయని విమర్శించారు.
ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి మంది ప్రజలు సంతకాలు చేసి తమ నిరసనను తెలియజేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని రెడ్డి శాంతి అన్నారు. ప్రజల ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కితీసుకోవాలి. ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రజల ఆస్తులని, వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని రెడ్డి శాంతి స్పష్టం చేశారు.




