Rajam: వైసీపీ విస్తృతస్థాయి సమావేశం - బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
Rajam: రాజాంలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ. పార్టీ మారేవారిపై కీలక వ్యాఖ్యలు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ.
Rajam: వైసీపీ విస్తృతస్థాయి సమావేశం - బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
రాజాం: రాజాంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. పార్టీ నుంచి ఒక్కరు వెళ్లిపోయినా.. వంద మంది కొత్తగా వస్తారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని అన్నారు.
పార్టీ నుంచి ఒక్కరు వెళ్లిపోతే.. వంద మంది కొత్తగా పార్టీలోకి వస్తారంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలు ఇటీవల వైసీపీకి దూరమైన మజ్జి శ్రీనును ఉద్దేశించే చేసినవిగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు సమస్య వచ్చినా అధైర్యపడవద్దని బొత్స భరోసా ఇచ్చారు. గతంలో కార్యకర్తల కష్టసుఖాలు చూడటానికి ఒకరు ఉంటే.. ప్రస్తుతం జిల్లా నుంచి ఇద్దరు అందుబాటులో ఉన్నారని తెలిపారు. తన కుమారుడు సందీప్, కుమార్తె అనూష అన్ని వేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అండగా ఉంటారని చెప్పారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో సుమారు 10 వేల మంది పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులను అందజేశారు. కొత్తగా ఎన్నికైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ను కార్యకర్తలు శాలువా కప్పి ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తలై రాజేష్, బొత్స అనూష, బొత్స సందీప్, టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీను, మండల నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




