Rajam: గంజాయి ముఠా గుట్టురట్టు 4 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం!
Rajam: రాజాం చీకటిపేట జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో 4 కిలోల 41 గ్రాముల గంజాయి లభ్యం. ముగ్గురు నిందితులు అరెస్ట్, మరో నలుగురు అదుపులోకి.
Rajam: గంజాయి ముఠా గుట్టురట్టు 4 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం చీకటిపేట జంక్షన్ వద్ద వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రాజాం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ సల్మాన్ బేగ్, సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా హోండా ఏవియేటర్ స్కూటర్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా స్కూల్ బ్యాగ్‌లో దాచిన 4 కిలోల 41 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్కూటర్, ఒక మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన నిందితులు ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన రాజేంద్ర పాడి, రాజాంకు చెందిన బండారు గుణశేఖర్ అలియాస్ గుణ, లచ్చయ్యపేటకు చెందిన ముడిమించి కార్తీక్గా పోలీసులు గుర్తించారు.
విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు శ్యాంపురం రోడ్డులోని మామిడి తోటలో గంజాయి సేవిస్తున్న పడాల గణేష్, సుగంధం మహేష్, జంగం కార్తీక్, చిక్కాల మణికంఠలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మరో 20 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ప్రధాన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి అదే రోజు కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు.
ఈ సందర్భంగా రాజాం సీఐ డి. నవీన్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక బృందాలతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నామని తెలిపారు. రాజాంలో గంజాయి కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తుల గురించి ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, గంజాయి వినియోగదారులను గుర్తించి అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు కూడా చేపడతామని తెలిపారు.




