Srikakulam: ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు – చింతాడ రవికుమార్!
Srikakulam: పొందూరు మండలంలో 5 ఎంపీటీసీ స్థానాల ఫోర్జరీ ఏకగ్రీవాలపై చింతాడ రవికుమార్ ధ్వజం. ఎమ్మెల్యే కూన రవికుమార్ కుట్రలపై ఈసీ, కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటన.
Srikakulam: ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవాలు – చింతాడ రవికుమార్!
శ్రీకాకుళం: పొందూరు మండలంలో ఐదు ఎంపీటీసీ స్థానాలను ఫోర్జరీ సంతకాలతో ఏకగ్రీవం చేసుకున్న కూటమి ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ల కుట్రలు ఉత్తరాంధ్ర రాజకీయ చరిత్రలోనే ఓ చీకటి రోజు అని వైఎస్ ఆర్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్ అన్నారు. నగరంలోని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విధానాలకు, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తూ దొడ్డిదారిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి ఐదు ఎంపీటీసీ స్థానాలను రవికుమార్ ఏకగ్రీవం చేసుకున్నారన్నారు. ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన సూర్యప్రకాష్ కూన రవికుమార్ ఇచ్చే డబ్బులకు అమ్ముడుపోయారని పేర్కొన్నారు.
తమ అభ్యర్థులు వారి నామినేషన్‌ను ఉససంహరించుకోలేదని, ఫోర్జరీ సంతకాలతో తమ అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు రిటర్నింగ్ అధికారితో కలసి కూన రవికుమార్ కుట్ర చేశారని చెప్పారు. విషయం తెలుసుకున్న వెంటనే మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో తమ అభ్యర్థులతో కలసి ఆర్ ఓ కార్యాలయానికి వెళ్లి సంబంధించిన రిటర్నింగ్ అధికారిని నిలదీశామని వివరించారు.
తమ అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్నట్టు సీసీ టీవీ పుటేజీ గానీ, ఫోటోలు గానీ చూపించాలని కోరామన్నారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను ఎందుకు ధిక్కారించరని ప్రశ్నించారు. ఆయన తప్పు ఒప్పుకున్నారని చెప్పారు. రాపాక, బానాం, నందివాడ, కోటిపల్లి, పొందూరు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్ ఆర్‌సీపీకి ప్రజల మద్దతు ఎక్కువగా ఉండడంతో తాము ఓడి పోతామన్న భయంతోనే కూన రవికుమార్ ఇటువంటి నీచరాజకీయాలకు పూనుకున్నారని స్పష్టం చేశారు.
వీరిలో ఇద్దరు దళిత అభ్యర్థులు కూడా ఉన్నారని, రాజ్యాంగ బద్ధంగా వారికి లభించిన రిజర్వేషన్‌తో పోటీ చేయాలన్న వారి ఆశలను తూట్లు పొడారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లి తమ అభ్యర్థుల కోసం న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి అప్పీలు చేశామని, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, కోర్టుకు వెళ్తామని చెప్పారు. శ్రీకాకుళంలో ఇటువంటి సంస్కృతికి తెరలేపిన కూన రవికుమార్ రాజకీయాలకు అనర్హుడని తెలిపారు.
వైఎస్ ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు మాట్లాడుతూ తాము తమ నానిమేషన్‌ను విత్‌డ్రా చేసుకోలేదని, తమ సంతకాలను ఫోర్జరీ చేసి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై కోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తారని పేర్కొన్నారు.
ఈ విలేకరుల సమావేశంలో మాజీ జడ్పీటీసీ లోలుగు కాంతారావు, పప్పల వెంకటరమణమూర్తి (మున్నా), వైఎస్ ఆర్‌సీపీ నాయకులు కొంచాడ రమణమూర్తి, పైడి నాగభూషణరావు, గాడు నాగరాజు, గుడ్ల మోహన్, కిల్లాన సూర్యారావు, మజ్జి గోపాలకృష్ణ, మొకర శంకర్, కంచరాపు సూర్యరావు, కిల్లాన రమణ, కూన కిరణ్, సురేంద్రనాయుడు, కూన రమణమ్మ, గురుగుబిల్లి చిట్టితల్లి, మొదలవలస భాగ్యలక్ష్మీ, తమ్మినేని లావణ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.




