Srikakulam: బాధిత మహిళలకు అండగా వన్ స్టాప్ సెంటర్: జడ్జి హరిబాబు
Srikakulam: శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్‌ను డీఎల్‌ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు.
Srikakulam: బాధిత మహిళలకు అండగా వన్ స్టాప్ సెంటర్: జడ్జి హరిబాబు
శ్రీకాకుళం: "హింస, వేధింపులకు గురవుతున్న మహిళలకు తక్షణ రక్షణతో పాటు ఉచిత న్యాయ సహాయం, వైద్యం, కౌన్సెలింగ్ అందించి వారిలో ధైర్యం నింపడంలో వన్ స్టాప్ సెంటర్ (సఖి) సేవలు ప్రశంసనీయం" అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు పేర్కొన్నారు.
శ్రీకాకుళం బలగలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న వన్ స్టాప్ సెంటర్‌ను మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మహిళలకు ఈ కేంద్రం ద్వారా అందుతున్న ఉచిత సేవలను, కేసుల నమోదు రిజిస్టర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆశ్రయం పొందుతున్న బాధితురాలితో నేరుగా ముచ్చటించి ఆమెకు అందుతున్న సదుపాయాలు, సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రంలో బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, వారి వ్యక్తిగత వివరాల్లో అత్యంత గోప్యత పాటించాలని సిబ్బందిని హరిబాబు ఆదేశించారు. పోలీసు సహాయంతో పాటు న్యాయపరమైన రక్షణ త్వరితగతిన అందేలా కేంద్ర నిర్వాహకులు చొరవ చూపాలని సూచించారు.
ఆపదలో ఉన్న మహిళలు ఎవరైనా న్యాయ సహాయం కోసం ఉచిత టోల్ ఫ్రీ నంబరు 15100ను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్ నిర్వాహకులు, కౌన్సెలర్లు, కేస్ వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.




