Srikakulam: ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం
Srikakulam: శ్రీకాకుళం ఆదిత్య మహిళా కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. విద్యార్థినులను ఘనంగా సత్కరించారు.
Srikakulam: ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరం
శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారు స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్దగల కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో నేడు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురుషులకు దీటుగా మహిళలు సైతం స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అత్యంత హర్షణీయమని, తోటివారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేసిన విద్యార్థినిలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.
అన్ని దానాలలోకెల్లా రక్తదానం ఎంతో మిన్న అని, ఆపదలో ఉన్నవారికి రక్తం అందించి పునర్జన్మ ప్రసాదించే గొప్ప అవకాశం దీనిద్వారా కలుగుతుందని ఎమ్మెల్యే విద్యార్థినులకు వివరించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రక్త కొరతను అధిగమించేందుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనల మేరకు ప్రతి కళాశాలలోనూ ఇటువంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని ఆయన ఆకాంక్షించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కళాశాల యాజమాన్యాన్ని, డైరెక్టర్ బి.ఎస్.చక్రవర్తిని, ప్రిన్సిపాల్ కె.శివశంకర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం రక్తదానం చేసిన విద్యార్థినులను ఎమ్మెల్యే గొండు శంకర్ గారు మరియు ఇతర అతిథులు దుస్సాలువాలతో సత్కరించి, వారికి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలతో పాటు పతకాలను అందజేసి వారి సేవాదృక్పథాన్ని ఘనంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్ మోహన్ రావు, జిల్లా యూత్ ఆఫీసర్ ఎన్.కృష్ణ, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కె.వేణు, ఎన్.ఎస్.ఎస్ పీవోలు పి.పైడి రాజు, డి.జగన్నాధం, ఎపివో ఆర్.రమాదేవి, ఉపాధ్యాయ బృందం, రెడ్ క్రాస్ ప్రతినిధులు జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య, జి.రమణ, బి.చిన్మయ రావు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.




