Srikakulam: ఎస్పీ ఆదేశాలతో సామాజిక అవగాహన కార్యక్రమాలు
Srikakulam: శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో నారీ శక్తి, సంకల్పం, అభయం హెల్మెట్ పేరిట సైబర్ నేరాలు, భద్రతపై పోలీసుల అవగాహన సదస్సులు.
Srikakulam: ఎస్పీ ఆదేశాలతో సామాజిక అవగాహన కార్యక్రమాలు
శ్రీకాకుళం: జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వివిధ సామాజిక అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, బాలల భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, రహదారి భద్రత మరియు హెల్మెట్ ధారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
నారీ శక్తి – మహిళా, బాలల భద్రతపై అవగాహన కల్పన.
నారీ శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలు, బాలికల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసులు వివరిస్తున్నారు. మహిళలకు అందుబాటులో ఉన్న శక్తి యాప్ వినియోగం, అత్యవసర సమయంలో డయల్ 112 ద్వారా పోలీసుల సహాయం పొందే విధానం, సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను వేధించడం, ఆన్‌లైన్‌లో పరిచయాల పేరుతో మోసాలు, మహిళల ఫొటోలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, బాలల రక్షణ, బాలికల భద్రత తదితర అంశాలపై తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ప్రజలకు అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.
సంకల్పం – మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అప్రమత్తత
సంకల్పం కార్యక్రమం ద్వారా యువత, విద్యార్థులు మరియు ప్రజలను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తున్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక, సామాజిక మరియు కుటుంబపరమైన అనర్థాల గురించి వివరిస్తున్నారు.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.అలాగే సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, OTP మోసాలు, బ్యాంకింగ్ మోసాలు, సోషల్ మీడియా మోసాలు తదితర వాటిపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, పిన్,పాస్‌వర్డ్ వంటి వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచిస్తున్నారు.
అభయం హెల్మెట్ – రహదారి భద్రతే లక్ష్యం.అభయం హెల్మెట్ కార్యక్రమం ద్వారా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన, ISI ప్రమాణాలతో కూడిన హెల్మెట్ ధరించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.హెల్మెట్ ధరించడం కేవలం ట్రాఫిక్ నిబంధన పాటించడం మాత్రమే కాకుండా ప్రాణాలను కాపాడే రక్షణ కవచం అని వివరిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో వాహనదారుడితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని సూచిస్తున్నారు.అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.




